Gujarat Lions defeated Kolkata Knight Riders by six wicketsకీలకమైన మ్యాచ్ లో కోల్ కతా జట్టు చేతులెత్తేసింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇరు జట్లు ఖచ్చితంగా విజయం సాధించాల్సిన తరుణంలో బరిలోకి దిగిన గుజరాత్ – కోల్ కతా మ్యాచ్ ఫలితాన్ని డ్వేన్ స్మిత్ శాసించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు కోల్ కతా బ్యాట్స్ మెన్లను పూర్తిగా నిలువరించడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా డ్వేన్ స్మిత్ 4 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సొంతం చేసుకోవడంతో, కేవలం 124 పరుగులకే పరిమితమైంది.

స్వల్ప లక్ష్య చేధనలో ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ జట్టును కెప్టెన్ సురేష్ రైనా 36 బంతుల్లో 53 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. రైనా రెచ్చిపోవడంతో కేవలం 13.3 ఓవర్లలో మ్యాచ్ ముగిసిపోయింది. ఈ విజయంతో 13 మ్యాచ్ లలో 16 పాయింట్లు అందుకుని దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ జట్టు తన చివరి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో శనివారం నాడు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కూడా గుజరాత్ విజయం సాధిస్తే టాప్ 2 జట్లలో ఒకటిగా నిలవనుండగా, ముంబై విజయం అందుకుంటే ప్లే ఆఫ్స్ బెర్త్ లు మరింత రసకందాయంలో పడే అవకాశం ఉంది.

నేడు జరగనున్న కీలక మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీ జట్టు నేడు జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉండగా, హైదరాబాద్ టీం ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. గుజరాత్ చేతిలో ఓడిన కోల్ కతా జట్టు ఒకే ఒక్క మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ జట్టుతో తలపడబోయే ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఇక, ఐపీఎల్ ను మోత మోగిస్తున్న బెంగుళూరు జట్టు తమ చివరి మ్యాచ్ లో ఢిల్లీ జట్టుతో తలపడనుంది. మిగిలి ఉన్న ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు నాకౌట్ లాంటిదే కావడంతో మ్యాచ్ లన్నీ ఆసక్తికరంగా సాగుతాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.