గుజరాత్లో భారీ మెజార్టీతో బిజెపి మళ్ళీ ఏడోసారి అధికారంలోకి రావడంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మరో కోణంలో నుంచి చూపుతూ విమర్శలు చేశారు. “దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వలననే గుజరాత్లో ఓడిపోయింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖచ్చితంగా దాని అధిష్టానం వైఫల్యమే. ఎందుకంటే గత ముప్పై ఏళ్లుగా గుజరాత్లో బిజెపి పాలనతో విసిగెత్తిపోయున్న ప్రజలు బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేక చతికిలపడింది. కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే గొప్ప అవకాశం మరెన్నడూ లభించదు. ఓ పక్క గుజరాత్లో కాంగ్రెస్‌కి ఎంతో కీలకమైన ఎన్నికలు జరుగుతుంటే, రాహుల్ గాంధీ వాటిని పట్టించుకోకుండా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో అంటూ పాదయాత్ర చేసుకొంటూ కాలక్షేపం చేశారే తప్ప గుజరాత్‌వైపు తొంగి చూడలేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయనని నెత్తిమీద పెట్టుకొని ఊరేగిస్తున్నాయి. బిజెపికి ప్రత్యామ్నాయంగా నిలబడవలసిన కాంగ్రెస్ పార్టీ ఈవిదంగా ఆగమ్యగోచరంగా ముందుకు సాగిపోతున్నందునే బిజెపి గుజరాత్లో విజయం సాధించగలిగిందని చెప్పవచ్చు. బిజెపికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలబడలేదని, దానిని ఎదుర్కొలేదని స్పష్టమైపోయింది. కనుక కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా నేనున్నానంటూ నిలబడుతున్న సిఎం కేసీఆర్‌వైపు దేశప్రజలు చూస్తున్నారిప్పుడు. కేసీఆర్ మాత్రమే బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలని సమర్ధంగా ఎదుర్కొని ఓడించగలరు. కేంద్ర ఎన్నికల కమీషన్ బిఆర్ఎస్కి ఆమోదం తెలిపింది కనుక ఇక సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను,” అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
నిజమే! నాయకత్వ లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడటం వలననే దేశవ్యాప్తంగా బిజెపి అల్లుకుపొగలుగుతోందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుని మార్చుకొంది కానీ నేటికీ దాని తీరు, ఆలోచనావైఖరి ఏమాత్రం మారలేదని గుజరాత్లో ఓటమి మరోసారి నిరూపించి చూపింది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే టీఎస్ఆర్టీసీ పార్టీ పేరుని బిఆర్ఎస్గా మార్చుతూ ఎన్నికల కమీషన్ టిఆర్ఎస్ అధిష్టానానికి లేఖ పంపింది. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తారా? ప్రవేశించి బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలని ఢీకొని రాణించగలరా లేక తెలంగాణలో తన పార్టీని కబళించడానికి వస్తున్న బిజెపితో పోరాటానికే పరిమితం అవుతారా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.