gudivada ycp warning to amaravati farmersవైసీపీ ప్రభుత్వం అమరావతి కట్టదలచుకోకపోయినా పర్వాలేదు. కానీ అమరావతిలో వైసీపీ ప్రభుత్వం నడుస్తున్న సచివాలయానికి, శాసనసభకి భూములు ఇచ్చిన రైతులను అవమానించకుండా, వేధించకుండా, భయపెట్టకుండా వారి మానాన్నవారిని పాదయాత్ర చేసుకొనిస్తే చాలు.

తమ జీవనోపాధిగా ఉండే భూములను అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు పాదయాత్రగా ఒక్కో జిల్లాలో ప్రవేశిస్తుంటే ఆయా జిల్లాల ప్రజలు వారిపై పూలవర్షం కురిపిస్తూ సాదరంగా ఆహ్వానిస్తూ వారితో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసావెల్లి వరకు వారు మహా పాదయాత్ర చేస్తున్నారు. వారిలో స్త్రీలు, వృద్ధులు కూడా ఉన్నారు. అయినా అలుపెరుగని పాదయాత్ర చేస్తూనే ఉన్నారు.

నేడు 12వ రోజు ఉదయానికి వారి మహాపాదయాత్ర కృష్ణాజిల్లాలోని పెడనకు చేరుకొంది. తర్వాత గుడివాడ మీదుగా ముందుకు సాగుతుంది. అయితే వారి పాదయాత్రకు సామాన్య ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతుంటే గుడివాడలో వైసీపీ నేతలు మాత్రం రైతులు భయంతో వణికిపోయేలా చేస్తున్నారు.

వైసీపీ యువదళం పేరుతో గుడివాడ దారి పొడవునా వారిని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. వాటిలో సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్ బొమ్మలతో పాటు వెనుక ఎన్టీఆర్‌, జూ.ఎన్టీఆర్‌ బొమ్మలు కూడా ఉన్నాయి.

వాటి కింద ఏమి వ్రాసి ఉందంటే, “మేము ఎవరి జోలికీ రాము. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం…” అని ఉంది. ఈవిదంగా పాదయాత్ర చేస్తున్న రైతులను ‘ఎగరేసి నరుకుతాం’ అంటూ తమ ఫోటోలతో పోస్టర్లు పెట్టి బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు ఎదిగిపోయారంటే దిగ్బ్రాంతి కలుగుతోంది.

ఇంతవరకు నిశ్చింతగా పాదయాత్ర చేస్తున్న రైతులు, ఈ పోస్టర్లను చూసి గుడివాడలో ఏం జరుగబోతోందో అని ఆందోళన చెందుతున్నారు. వారు పోలీసుల సాయం కోరినా వారు కాపాడుతారనే నమ్మకం లేకపోవడంతో వైసీపీ కార్యకర్తల ముసుగులో ఒకవేళ గూండాలు దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. కానీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి ఆ పోస్టర్లను తొలగింపజేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కానీ ఏ నిమిషంలో ఎటునుంచి ఏ రాయి పడుతుందో అని రైతులు భయపడుతూ ముందుకు సాగుతున్నారు.

పాదయాత్ర చేస్తున్న రైతులకు ఏదైనా జరిగితే ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఈ పోస్టర్ల వ్యవహారాన్ని హైకోర్టు సుమోటుగా స్వీకరించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెపుతారు?రాజధాని కోసం భూములిచ్చి, అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులకు మనం ఇచ్చే గౌరవం ఇదా?