Gudivada Amarnathవైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముంగిట ప్రత్యక్షం అయ్యారంటే… మరికొద్ది నిముషాల్లోనే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతున్నారు. అంతలా సదరు వైసీపీ నేతల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల వైరల్ అయిన ‘బియ్యపు సుధాకర్ రెడ్డి అండ్ కో’ల గురించి అంతకుముందు వరకు పెద్దగా తెలియదు.

కానీ అసెంబ్లీ సమావేశాలలో ఇచ్చిన ప్రసంగాలతో ట్రోల్ కావడంతో చాలామందికి ‘బియ్యపు సుధాకర్ రెడ్డి అండ్ కో’ వర్గం చేరువయ్యింది. తాజాగా ఈ జాబితాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. 2019లో అనకాపల్లి నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికైన గుడివాడ అమరనాథ్ ఈ జాతిరత్నాల జాబితాలో చోటు దక్కించుకున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

‘నాగార్జునసాగర్ డ్యామ్ ను 1955లో నిర్మాణం చేపట్టాం, ఆ తర్వాత దాని పైన శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, ఇపుడు దాని క్రింద పోలవరం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు’ అంటూ అనకాపల్లి ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘రామ రామ… నాగార్జునసాగర్ క్రింద పోలవరం ప్రాజెక్టా?’ అంటూ ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతయ్యింది. మీడియా ముందుకు వచ్చేటపుడు చెప్పాలని అనుకున్న అంశం పైన సమగ్రంగా సమాచారం తీసుకుంటే ఇలాంటి తిప్పలు తావు ఉండదు అనేవి విశ్లేషకుల మాటలు.

అలా కాకుండా ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం మీడియా ముందుకొచ్చి ఏదోకటి మాట్లాడితే మాత్రం ఇలాంటి ‘జాతిరత్నాలు’ వస్తూనే ఉంటారని వైసీపీ అధినాయకత్వం గమనించుకోవాలి. ‘విషయ పరిజ్ఞానం లేని వైసీపీ ఎమ్మెల్యేలు’ అని పార్టీకి చెడ్డ పేరుతో పాటు ప్రజలలో చులకన భావన ఏర్పడే ప్రమాదం ఉందని ఎప్పటికి తెలుసుకుంటారో!