YS-jagan-vizag-Gudivada-Amarnathసిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన చేసే గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు పదేపదే టిడిపి, జనసేన పార్టీలను “175 సీట్లలో పోటీ చేస్తారా లేదా?ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా లేదా?” అంటూ సవాళ్ళు విసురుతూనే ఉంటారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అయితే పొత్తులు పెట్టుకొనేవారందరూ ‘తోడేళ్ళ గుంపు’ అని తాను వాటిని ఒంటరిగా ఎదుర్కొంటున్నానని చెప్పుకొంటూ ప్రజల నుంచి సానుభూతి కోరుకొంటుంటారు! అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ ఆంక్షలు లేవు కానీ వారి మాటల వింటుంటే ఏపీలో ఉన్నాయన్నట్లు ఉంటాయి.

ఇప్పుడు ‘విశాఖలో జగనన్న కాపురం’ అనే కొత్తపాటను అందరూ అందుకొన్నారు. కనుక ముందుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ దానికి తాళం వేయడం మొదలుపెట్టారు. “విశాఖను రాజధాని చేస్తామని మేము చెపుతున్నాము. దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి?” అంటూ టిడిపి, జనసేనలకి సవాలు విసిరారు.

వాస్తవానికి ఉత్తరాంద్రలో టిడిపి అడ్రస్ లేకుండా చేద్దామనే ‘విశాఖలో జగనన్న కాపురం’ పాట అందుకొన్నామని ఈరోజే మంత్రి దాడిశెట్టి రాజా చెప్పేశారు. ఒకవేళ మూడు రాజధానులకు సుప్రీంకోర్టు కూడా నో చెప్పేస్తే అప్పుడు ప్రజలకు ఏం చెప్పుకోవాలి?మూడు రాజధానులను మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తూ అమరావతి కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు విమర్శలను ఏవిదంగా ఎదుర్కోవాలనే ఆలోచన అప్పుడే వైసీపీలో మొదలైపోయిన్నట్లు ఈ ‘కొత్త కాపురం’తో అర్దమవుతోంది.

జగనన్న విశాఖలో కాపురం పెట్టి రాజధానిని, ఉత్తరాంద్ర జిల్లాల్లాలను అభివృద్ధి చేసేయాలనుకొన్నారని, కానీ టిడిపి, జనసేనలు కుట్రలు పన్ని విశాఖ రాజధాని కాకుండా అడ్డుకొన్నాయని ఎన్నికల సమయంలో చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టేందుకు అవసరమైన మెటీరీయల్ వైసీపీ సిద్దం చేసుకొంటున్నట్లు అర్దం అవుతోంది. అందుకే వైసీపీలో ఈ ‘విశాఖలో జగనన్న కాపురం’ పాట అందుకొన్నట్లున్నారు.

“175 సీట్లలో పోటీ చేస్తారా లేదా?” అనే పాచిపోయిన సవాలుతో పాటు ఇకపై “విశాఖను రాజధానిగా చేయడాన్ని అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పండి?” అంటూ సవాలు చేయడం మొదలుపెట్టవచ్చు. టిడిపి, జనసేనల చేత కాదని చెప్పించగలిగితే, “చూశారా… ఉత్తరాంద్ర అభివృద్ధి కావడం వీరికి ఇష్టం లేదట… మరి అలాంటి పార్టీలను ఉత్తరాంద్రలో అడుగుపెట్టనీయకుండా తరిమి కొట్టండి,” అని చెప్పుకోవాలని వైసీపీ దురాశపడుతోంది.

అయితే నాలుగేళ్ళుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయకపోగా తమ అసమర్దతను, వైఫల్యాలని కప్పి పుచ్చుకొనేందుకు కూడా టిడిపి, జనసేనలను బలిచేసేయాలనుకోవడం అతి తెలివి కాదా?

అసలు విశాఖ రాజధాని చేయాలని ఉత్తరాంద్ర ప్రజలు ఏనాడైనా అడిగారా? లేదు కదా? రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధాని కావాలనుకొంటున్నారు కనుకనే దానికి కట్టుబడున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టిడిపి నేతలను, పవన్‌ కళ్యాణ్‌ని అదరిస్తున్నారు… అభిమానిస్తున్నారు. ప్రజల మనసులో ఏముందో అర్దం చేసుకోవడానికి అది చాలదా?