విశాఖలో సముద్రతీరాన్న ఆహ్లాదకరమైన పచ్చటి ఋషికొండపై ఉన్న టూరిస్ట్ కాటేజీలని కూల్చివేసి, కొండకి గుండుకొట్టేసి పెద్ద మట్టిదిబ్బగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ అక్కడే కొత్తగా భవనాలని నిర్మిస్తోంది. ఇదంతా పర్యాటక అభివృద్ధి కోసమేనని హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి నచ్చజెపుతోంది. ప్రతిపక్ష నేతలు ఎవరైనా అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వస్తే అటువైపు వెళ్ళేందుకు కూడా అనుమతించడం లేదు. కానీ మట్టిదిబ్బగా మారిన ఋషికొండపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కొన్ని భవనాలు నిర్మిస్తోంది.
‘త్వరలో విశాఖకి తరలివెళుతున్నానంటూ’ సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “సాక్షాత్ ముఖ్యమంత్రే విశాఖకి తరలివస్తామని చెపుతుంటే ఇంకా రాజధాని ఎక్కడ అనే సందేహం ఎందుకు?ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని అవుతుంది. ఆయన విశాఖకి తరలివస్తున్నారు కనుక విశాఖ రాజధాని అవుతుంది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకి భవనాలు సరిపోకపోతే ఖాళీగా ఉన్న కాలేజీ, పర్యాటక భవనాలని ఇంకా అవసరమైతే ప్రైవేట్ భవనాలను అద్దెకి తీసుకొంటాము,” అని అన్నారు.
వాటిలో ఖాళీగా ఉన్న పర్యాటక భవనాలు అంటే ఋషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలే అని అర్దమవుతూనే ఉంది. వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేదా మరొకదాని కోసమో తీసుకోబోతోందని అర్దమవుతోంది. అదే కనుక చేస్తే ఇంతకాలం కోర్టులని వైసీపీ ప్రభుత్వం తప్పు దోవ పట్టించిందని భావించవచ్చు.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్రభుత్వమే తన ఫోన్లని ట్యాపింగ్ చేయించిందని ఆరోపణలు చేశారు. వాటిపై స్పందిస్తూ, “ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటున్నప్పుడు వారిలో ఒకరు ఆ సంభాషణని రికార్డ్ చేస్తే దానిని కాల్ రికార్డింగ్ అంటాము. అదే వారిద్దరూ మాట్లాడుకొంటూనప్పుడు మూడో వ్యక్తి వింటున్నట్లయితే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటాము. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడే తమ సంభాషణని రికార్డ్ చేసి ప్రభుత్వానికి పంపించి ఉండవచ్చు కదా?అప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ ఎలా అవుతుంది?కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏవో కారణాల చేత పార్టీ మారాలనుకొన్నారు. అందుకోసం బేస్ తయారుచేసుకొనేందుకు ప్రభుత్వం మీద ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పార్టీ మారాలనుకొంటే నిరభ్యంతరంగా మారవచ్చి. దాని కోసం ఇదంతా ఎందుకు? పార్టీ మారాలనుకొంటున్నాననని ఒక్క ముక్క చెపితే సరిపోతుంది కదా?” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు.