Gudivada Amarnathఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళుపైనే అయ్యింది. అప్పటి నుంచి మూడు రాజధానుల పాట పాడుతూనే ఉంది. ఆ పేరుతో ఆ పార్టీ నేతలు మూడు ప్రాంతాలలో కుంపట్లు రాజేస్తూనే ఉన్నారు. ఎవరైనా అమరావతి అంటే అదేదో చాలా ఆశ్లీలమైన లేదా నిషేదిత పదమన్నట్లు వైసీపీ నేతలు మండిపడుతుంటారు.

గత ఏడాది ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన మొదలుపెట్టేస్తామని మంత్రులందరూ బల్లగుద్ది వాదించారు. కానీ నేటికీ ఏర్పాటు కాలేదు. మళ్ళీ ఉగాది వచ్చేస్తోంది కనుక ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మళ్ళీ కొత్త ముహూర్తం ప్రకటించారు. “రెండు నెల్లో విశాఖకి రాజధాని వచ్చేస్తుందని… కావాలంటే రాసి పెట్టుకోండి…” అని మొన్ననే మరోసారి గట్టిగా చెప్పారు.

ఆయన పదేపదే విశాఖ రాజధాని అంటుంటే టీవీ 9 న్యూస్ ఛానల్ ఆయనకి ‘వాల్తేర్ వీరయ్య’ అని బిరుదు కూడా ఇచ్చేసింది. విశాఖ రాజధాని కోసం తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించి, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడానికి సిద్దం అవుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇక ఏ త్యాగాలు చేయక్కరలేదు. ఉద్యమాలు చేయాల్సిన శ్రమ కూడా తప్పుతుంది. , తనకి అటువంటి బిరుదు దక్కనందుకు బాధ పడుతున్నారేమో తెలీదు. కానీ టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీల నేతలు గుడివాడ అమర్నాథ్ రెడ్డి తాజా ప్రకటన కేవలం ప్రజలని మభ్యపెట్టేందుకే అని వాదిస్తున్నాయి.

రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా విశాఖలో రాజధాని ఏవిదంగా ఏర్పాటుచేయగలరని బిజెపి ప్రశ్నించగా, మార్చి3,4 తేదీలలో విశాఖలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీకి రాజధాని ఏదని అడిగితే చెప్పుకోవాలి కనుకనే మంత్రి గుడివాడ మళ్ళీ ఈ కొత్త ముహూర్తం ప్రకటించారని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.

మూడు ప్రధాన పార్టీల వాదనలు సహేతుకంగానే ఉన్నట్లు అర్దమవుతోంది. అమరావతినే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం తరపున బిజెపి చెపుతుంటే కేంద్రాన్ని కాదని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యమేనా? ఒకవేళ చేయాలనుకొన్నా హైకోర్టు, సుప్రీంకోర్టులు అడ్డుకోకుండా ఉంటాయా?