Gudivada-Amarnath-Visakhaptnam-Andhra-Pradesh-Capital-JACవిశాఖ జిల్లాలో నిన్న రాత్రి నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకొని జోరుగా వాన కురుస్తోంది. మరో పక్క జిల్లాపై రాజకీయ మేఘాలు కూడా కమ్ముకొని నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నేడు ‘నాన్ పోలిటికల్ జేయేసీ’ పేరుతో వైసీపీ విశాఖ ఘర్జనకు సిద్దమవుతోంది. మరో పక్క జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజులు ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకోబోతున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు నేడు విశాఖలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ మూడు పార్టీల లక్ష్యం ఒకటే. విశాఖ రాజధానిపై తమ భిన్నాభిప్రాయాలను బలంగా వినిపించడం.

కేవలం 600 మంది రైతులు అరసవిల్లికి మహాపాదయాత్ర చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని అనుమతి నిరాకరించిన పోలీసులు, సుమారు లక్ష మందితో విశాఖ గర్జన ర్యాలీని మంత్రి గుడివాడ అమర్నాధ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కనుక ర్యాలీకి ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే జైల్ రోడ్, సిరిపురం రోడ్డు మీదుగా బీచ్‌ రోడ్డు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ర్యాలీకి మార్గం సుగమం చేశారు.

ఈరోజు ఉదయం 10.30 గంటలకి ఎల్ఐసీ భవనం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ర్యాలీ మొదలై సిరిపురం మీదుగా సాగి బీచ్‌ రోడ్డులో వైఎస్సార్ విగ్రహం వద్ద మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. అనంతరం జరిగే భారీ బహిరంగసభలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్న ఈ సభలో విశాఖను రాజధాని చేయాలని వారు డిమాండ్ చేయబోతున్నారు.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నేడు విశాఖ ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారు. అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ విశాఖను రాజధాని చేయాలా వద్దా?అని గనుక ఈ పర్యటనలో అమరావతిని రాజధానిగా ఉంచాలని నొక్కి చెప్పేందుకే ఆయన వస్తున్నట్లు భావించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు నాగబాబు నిన్ననే విశాఖకు చేరుకొన్నారు.

ఇక విశాఖను రాజధాని పేరుతో ఉత్తరాంద్ర ప్రజలను టిడిపికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వైసీపీ చేస్తున్న నీచరాజకీయాలను ధీటుగా తిప్పి కొట్టేందుకు అచ్చెన్నాయుడు నేడు విశాఖలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

ఒకే రోజున మూడు ప్రధాన పార్టీలు విశాఖలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తుండటంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనుక ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా 1200 మంది పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

విశాఖను రాజధానిగా చేయాలని నగర ప్రజలు లేదా ఉత్తరాంద్ర ప్రజలు కోరుకొంటే విచిత్రం కాదు కానీ తమ చేతిలోనే అధికారం ఉంచుకొన్న వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేయాలంటూ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉంది కదా?