JanaSena-Pawan-Kalyan-Varahi-Vehicle-Colour-Controversyఏపీలో వైసీపీ ప్రభుత్వ రాజకీయకక్ష సాధింపులకు దాని ప్రత్యర్ధులు బలవుతూనే ఉన్నారు. వారి ఇళ్ళు కూల్చివేయబడుతూనే ఉన్నాయి. చివరికి వారి వాహనాలను కూడా రాష్ట్రంలో తిరగనీయమని మంత్రి గుడివాడ అమర్నాధ్ హెచ్చరిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తన రాష్ట్ర పర్యటనలకి, ఎన్నికల ప్రచారానికి మిలటరీ వాహనాన్ని పోలిన ‘వారాహి’ అనే వాహనాన్ని తయారుచేయించుకొని సోషల్ మీడియాలో దాని ఫోటో పెట్టగానే వైసీపీ నేతలు భగ్గుమన్నారు.

మిలటరీ వాహనాలకు వేసే రంగుని వేసినందున మోటారు వాహన చట్టం ప్రకారం దానికి రిజిస్ట్రేషన్ జరగదంటూ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. అయితే తెలంగాణ రవాణాశాఖ ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, దానికి వేసిన రంగు మిలటరీ వాహనాలకు వేసే రంగు కాదని అది వేరే రంగని నిర్దారించుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి నంబర్: టిఎస్13 ఈఎక్స్ 8384ని కేటాయించింది. ఆ వాహనం దేశంలో ఎక్కడికైనా తిరిగేందుకు వీలుగా నేషనల్ పర్మిట్ కూడా జారీ చేసింది. కనుక అది ఏపీలో తిరిగేందుకు ఎటువంటి అభ్యంతరం ఉండదు.

కనుక ఇప్పటికైనా వైసీపీ మంత్రులు తగ్గి ఉంటే హుందాగా ఉండేది. కానీ పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాధ్ మరో పనేదీ లేనట్లు ‘వారాహి’ గురించి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు చాలా చవుకబారుగా, వైసీపీ కక్ష సాధింపు వైఖరికి అద్దం పట్టేవిగా ఉన్నాయి.

మొదట “వారాహికి రిజిస్ట్రేషన్ అయ్యిందా.. ఎప్పుడు… ఎక్కడ?” అని ప్రశ్నించిన మంత్రి అమర్నాధ్ తర్వాత దాని నంబరుతో సహా అన్ని ఆయనే చెప్పడం విశేషం.

విలేఖరుల ప్రశ్నకి బదులిస్తూ “ఆయన ఉండేది తెలంగాణలో! ఇక్కడ కాదు కదా?కనుక దాంతో ఆయన అక్కడ తిరుగుతాడేమో?ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం,” అని అన్నారు.

“దానికి తెలంగాణ ప్రభుత్వం నేషనల్ పర్మిట్ ఇచ్చింది కదా? మరి ఏపీ ప్రభుత్వం ఎలా అడ్డుకొంటుంది?” అని విలేఖరులు ప్రశ్నించగా, అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. మన దేశంలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ అమలులో ఉంది. కనుక అక్కడ తిప్పిన్నట్లు ఇక్కడ తిప్పుతామంటే కుదరదు కదా?

తెలంగాణ రవాణాశాఖకి ఏవిదంగా ప్రత్యేకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అదేవిదంగా ఏపీకి కూడా ఉంటాయి కనుక ఆ వాహనానికి తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ అది ఇక్కడకి వచ్చినప్పుడు ఏపీ రూల్స్ ప్రకారం ఉందా లేదా?అని పరిశీలించాకే ఏపీ రవాణాశాఖ అధికారులు తగిన సూచనలు చేస్తారు. అప్పుడు దానికి ఆయన పసుపు రంగే వేసుకొంటారో మరోటి వేసుకొంటారో ఆయనిష్టం. మేము కలర్ మార్చాలని చెప్పాం తప్ప బండి మార్చాలని చెప్పలేదు కదా?” అని అన్నారు. కదా?” అని అన్నారు.

వారాహి నంబరు గురించి కూడా ఆయన చాలా లేకిగా మాట్లాడారు. “ఆయన వాహనం నంబరు, ఎంచుకొన్న అక్షరాలు అన్నీ ఆయనకి నచ్చిన్నట్లే పెట్టుకొన్నాడు. వాహనం నంబర్ 8384 అంటే ఏమిటో అర్దం అవుతోంది కదా? ఆ నాలుగు సంఖ్యలని కలిపితే 23. చంద్రబాబు నాయుడుకి నచ్చిన నంబర్. చూద్దాం ముందు ఆ వాహనంతో ఆయనని ఏపీలోకి రానీయండి. అప్పుడు చూద్దాం ఎలా తిరుగుతాడో?” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

వాహనాలకి ఫ్యాన్సీ నంబర్లు పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయమే. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఈ వాహనం కోసం ఎటువంటి ఫ్యాన్సీ నంబరు కోసం దరఖాస్తు చేసుకోలేదు. తెలంగాణ రవాణాశాఖ కేటాయించిన నంబరు అది. దానిపై కూడా మంత్రి అమర్నాధ్ ఈవిదంగా రాజకీయాలు చేయడం చాలా లేకిగా, చవుకబారుగా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఈవిదంగా కక్షసాధింపులకు పాల్పడుతున్న కొద్దీ తమ రాక్షస మనస్తత్వం, పైశాచికానందమే బయటపెట్టుకొంటున్నామని వైసీపీ నేతలు గ్రహించినట్లు లేదు.