YSRCP_gudivada_amarnathమూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి భారీ మెజార్టీతో గెలుచుకోవడం వైసీపీ నేతలకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న మంత్రులు, రకరకాల వాదనలు చేస్తూ, వీటికి అంత ప్రాధాన్యత లేదని చెపుతూ, ఓటమిని చిన్నదిగా చేసి చూపించేందుకు నానా తిప్పలు పడుతున్నారు.

కోడి-గుడ్డుతో పాపులర్ అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, “మేమేమీ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అని అనలేదు. అలాగే మూడు రాజధానులపై రిఫరెండం అని కూడా అనలేదు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఓ వర్గానికి మాత్రమే పరిమితమైనవి. వాటిలో కూడా మేము 36 ఓటింగ్ శాతం సాధించాము. ఇంకా చెప్పాలంటే ఇవి జస్ట్… భారత్‌-కెన్యా మ్యాచ్ వంటి చాలా చిన్న మ్యాచ్. దీనిలో కెన్యా (టిడిపి) గెలిచి సంబరాలు చేసుకొంటే మాకేమీ అభ్యంతరం లేదు. ఈ ఎన్నికల ఫలితాలపై మేము సమీక్షించుకొంటాము. విశాఖ రాజధాని అని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. కానీ ఆయన విశాఖకు ఎప్పుడు తరలివస్తారో ఖచ్చితంగా తేదీలు ప్రకటించాల్సిన అవసరం ఉందని మేము భావించడం లేదు. జూలైలో వస్తామని చెప్పారు కదా?” అని అన్నారు.

వైసీపీని ఎన్నికలలో గెలిపించే కాంట్రాక్ట్ ‘ఐ-ప్యాక్‌’కి అప్పగిస్తే అది శల్యసారధ్యం చేసి టిడిపిని గెలిపించింది! ఈ నాలుగేళ్ళలో ప్రతీ ఎన్నికలలో వరుసగా గెలుస్తుండటంతో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అవలీలగా గెలుస్తామనే ధీమాతో, కొందరు వైసీపీ నేతలు వీటిని వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని, మూడు రాజధానులకు రిఫరెండం అని గొప్పగా చెప్పుకొన్నారు.

ఒకవేళ గెలిచి ఉంటే “చూశారా.. చూశారా… ప్రజలు మావైపే ఉన్నారు. మూడు రాజధానులు కోరుకొంటున్నారు…” అంటూ వైసీపీ నేతలందరూ గొప్పగా చెప్పుకొని ఉండేవారు కదా?కానీ వారి దురదృష్టవశాత్తు మూడు ఎమ్మెల్సీ సీట్లను టిడిపి గెలుచుకొంది. కనుకనే చెప్పుకోలేక ఇప్పుడు ‘టిడిపి హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్’ అంటూ కొత్త పాట కోరస్ పాడుతున్నారనుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఆ స్కామ్‌ జరిగిఉందని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, నాలుగేళ్ళుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?మరెందుకు దర్యాప్తు జరిపించలేదని టిడిపి నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీలో ఎవరూ వారి ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు!

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో త్వరలో విశాఖకు తరలివస్తానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఎప్పుడు వస్తారో తెలీదని మంత్రి గుడివాడ చెపుతున్నారు. సదస్సులో రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రేపు మేము అలా చెప్పలేదంటారేమో?