Gudivada Amarnathగత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్ళివచ్చారు. కానీ ఈసారి ఆహ్వానం రానందున వెళ్ళలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా బదులిచ్చారు.

“నవంబర్‌ 25వ తేదీనే సిఎం జగన్‌కి దావోస్‌ సదస్సుకి ఆహ్వానం వచ్చింది. మనం దావోస్ సదస్సుకి వెళ్ళకపోయినా ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నాము. దానిలో భారీగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఏటా దావోస్ వెళ్ళి వచ్చినా సగటున ఏడాదికి రూ.11,000 కోట్లు పెట్టుబడులు మాత్రమే సాధించగలిగారు. ఈ మూడేళ్ళలో సగటున ఏడాదికి రూ.15,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అంటే గత ప్రభుత్వం కంటే రూ.4,000 కోట్లు ఎక్కువే అన్నమాట!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నంబర్:1 స్థానంలో ఉంది. ఏపీ నుంచి రూ.97,000 కోట్ల ఎగుమతులు జరగడమే ఇందుకు నిదర్శనం. సిఎం జగన్‌ హీరోయిజం, చరిష్మా చూసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రకృతి కూడా సహకరిస్తుండటంతో పంట దిగుబడి భారీగా పెరిగింది.

కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న టిడిపి నేతలు అమర్ రాజా బ్యాటరీస్ రాష్ట్రాన్ని విడిచివెళ్ళిపోయిందని, దానికి మేమే కారణమని దుష్ప్రచారం చేస్తున్నారు. చివరికి నాపై కూడా వ్యక్తిగత విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ టిడిపి నేతలు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు జగనన్న పాలనతో సంతృప్తిగా ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల ఆటలు, కుట్రలు సాగవు. వారిద్దరూ ఎలాగూ పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడిపోయారు కనుక వేర్వేరుగా ప్రచారం చేసుకొనే బదులు ఇద్దరూ కలిసి వారాహి వాహనంలోనే ప్రచారం చేసుకొంటే ఖర్చులు కలిసొస్తాయి కదా?” అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి సగటున ఒక నెలకి రూ.3-4,000 కోట్లు పెట్టుబడులు వస్తుంటాయి. అంటే ఆ రాష్ట్రానికి మూడు నెలలో వచ్చే పెట్టుబడులు సాధించడానికి ఏపీకి ఏడాది సమయం పడుతుందన్న మాట! దానికే గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?ఏపీకి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ హైదరాబాద్‌లో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవమే కదా?ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా పొరుగు రాష్ట్రంలోనే పెట్టుబడులుపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారంటే అర్దం ఏమిటి?