YS-jagan-vizag-Gudivada-Amarnathనేడు సిఎం జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన చేయడంపై టిడిపి విమర్శలకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకొని అడ్డంగా దొరికిపోయారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “భోగాపురం విమానాశ్రయానికి మేము ఎప్పుడో శంకుస్థాపన చేశాము మళ్ళీ సిఎం జగన్‌ ఎందుకు చేస్తున్నారంటూ టిడిపి నేతలు విమర్శలు చేయగానే వారికి మద్దతుగా కొన్ని పత్రికలు బ్యానర్‌ ఐటెమ్స్ ప్రచురిస్తున్నాయి. అసలు భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు శంకుస్థాపన చేశారంటే 2019, ఫిభ్రవరి 15వ తేదీన! అంటే ఎన్నికలు దగ్గరపడిన తర్వాత! అంటే ఎన్నికలొస్తేనే శంకుస్థాపనలు చేస్తారన్న మాట! ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టడానికి అప్పుడు శంకుస్థాపన చేశారు తప్ప నిర్మించాలని కాదు.

రామయ్యపట్నం పోర్టులో మేము శంకుస్థాపన చేస్తే అక్కడా మేము ఇదివరకే చేశామంటారు? శంకుస్థాపనలు తప్ప మరేం చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. ఓ శిలాఫలకం… దానిని వేయడానికి ఓ మేస్త్రీ ఉంటే చాలన్న మాట? అటుగా వెళుతూ శంకుస్థాపనలు చేసేస్తారన్న మాట,” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

అయితే ఓ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ నిర్మాణపనులు మొదలుపెడుతుంది తప్ప మళ్ళీ శంకుస్థాపన చేయదు. కానీ జగన్ ప్రభుత్వం చేస్తోంది. అదీ… నాలుగేళ్ళు కాలక్షేపం చేసి ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు!అంటే మంత్రి గుడివాడ అమర్నాథ్ గత ప్రభుత్వాన్ని ఆక్షేపించబోయి, తాము కూడా అదే చేస్తున్నామని బయటపెట్టుకొన్నారు.

ఇక టిడిపి ప్రభుత్వం ఎన్నికల కోసమే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిందని వాదిస్తున్న పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాద్‌కి దాని కోసం టిడిపి ప్రభుత్వం రెండు మూడేళ్లు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి అనుమతులు సాధించుకొంటూ, మరో పక్క వందలాది మంది రైతులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి భూసేకరణ చేసిందనే సంగతి తెలియదనుకోలేము. అసలు భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన చేసిందే చంద్రబాబు నాయుడు. ఆ ఆలోచన ఆచరణ రూపం దాల్చడానికి ఇంత సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. అది పూర్తవడానికి అంత సమయం పట్టింది. ఒకవేళ టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈపాటికి దానితో పాటు అమరావతి, పోలవరం నిర్మాణ పనులు కూడా ఓ కొల్లికి వచ్చి ఉండేవని అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుది అభివృద్ధి విధానం కనుక!

టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి మంత్రులు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వలేదు. ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండేవారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉండేది. మద్యలో హూద్ హూద్ తుఫానులాంటివి వచ్చాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పేచీలు… అనేక సమస్యలను చంద్రబాబు నాయుడు ఎంతో నిబ్బరంగా ఎదుర్కొంటూ అటువంటి పరిస్థితులలో కూడా అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేసి, అవసరమైన అనుమతులన్నీ సాధించి వడ్డించిన విస్తరిలా వైసీపీ ప్రభుత్వం చేతికిస్తే, నాలుగేళ్ళుగా అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేకపోయింది. ఇప్పుడు ఎన్నికల దగ్గరపడుతుంటే ఒకటోసారి… రెండోసారి అంటూ శంకుస్థాపనలు చేస్తూ ఈవిదంగా నిర్లజ్జగా సమర్ధించుకొంటూ ఎదురు ప్రశ్నిస్తుండటం సిగ్గుచేటు కదా?