Gudivada Amarnath about pawan kalyanవైసీపీలో తాజా మాజీల బాధ ఒకలా ఉంటే, కొత్త మంత్రుల హడావుడి మరోలా ఉంటోంది. తమ అభిమాన హీరో ఫ్లాప్ సినిమాను చూసి థియేటర్‌లో నుంచి బయటకు వస్తూ ఏడ్వలేక ‘సూపర్ హిట్…కెవ్వు కేక…’ అన్నట్లుంది వారి తీరు. తాజా మాజీలు ఏం చెపుతారో అందరికీ తెలుసు కనుక కొత్తగా కాపురానికి వచ్చినవారి ముచ్చట్లే ముందుగా చెప్పుకోవాలి.

మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇదివరకు జనసేన కార్యాలయంతో తాను పవన్ కళ్యాణ్‌తో తీయించుకొన్న ఓ ఫోటోని మీడియాకు చూపిస్తూ, “ఇదిగో ఈ ఫోటో చూడండి…దీనిలో నేను ఆయనతో ఫోటో తీయించుకొన్నట్లు ఉందా లేక ఆయనే నాతో ఫోటో తీయించుకొన్నట్లు ఉందా? నేను ఎమ్మెల్యేని ఇప్పుడు మంత్రిని. కనుక రోజూ నాతో అనేకమంది ఫోటోలు దిగాలని ఆరాటపడుతుంటారు. కనుక ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌తో నేను ఫోటో దిగడం ఏమిటి? ఆయనే నాతో ఫోటో దిగారు. నా పక్కన వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్న ఆయనని చూస్తే అర్ధం అవుతోంది కదా?” అన్నారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. వెనక గోడపై జనసేన బ్యానర్ కనిపిస్తుంటే, పవన్ కళ్యాణ్‌ నీ వద్దకు వచ్చి ఫోటో దిగాడని చెప్పుకోవడం ఏమిటి?అని ఒకరు, పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగి దానిని నేటికీ పదిలంగా దాచుకొని ఇప్పుడు ఇలా తిరగేసి చెపుతున్నాడేమిటి?అంటూ జనాలు నవ్వుకొంటున్నారు.

మంత్రి పదవి ఇచ్చిన జగనన్నని మెప్పించడం కోసం ఇలా మాట్లాడేస్తే నవ్వులపాలవడం ఖాయం. అది వేరే సంగతి. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐ‌టి, పరిశ్రమలు, వాణిజ్య శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగారే ఈవిదంగా ముందూ వెనుకా చూసుకోకుండా మాట్లాడేస్తుంటే, ఇక ఆయన దేశముదురు పారిశ్రామికవేత్తలతో, ఐ‌టి కంపెనీలతో ఏవిదంగా మాట్లాడగలరు?ఏపీని చూసి భయపడుతున్న వారిని ఏవిదంగా ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను రప్పించగలరు?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇదే శాఖలను నిర్వహిస్తున్న కేటీఆర్‌ ఎంత పరిణతితో మాట్లాడుతున్నారో, రాష్ట్రానికి పెట్టుబడులను వరదలా ఏవిదంగా ప్రవహింపజేస్తున్నారో చూసి నేర్చుకొంటే అందరికీ మంచిది కదా?