GST - Goods Services Tax Lawప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ… జీ..ఎస్..టీ..! ఈ మూడక్షరాలు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేయబోతున్నాయన్న విషయం మాత్రం స్పష్టం. అయితే అది ఏ మేరకు ఉంటుందో అన్నది మాత్రం అగమ్యగోచరంగా మారింది. అలాగే పాజిటివ్ గా మారుతుందా? నెగటివ్ గా మారుతుందా? అన్నది కూడా ఎవరికీ అంతుపట్టని విషయం తయారైంది. అయితే 140కి పైగా దేశాలలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానం, ఇండియాలో మాత్రం ఎందుకు ఈ రచ్చ అవుతోంది… ఇంత చర్చలకు దారి తీస్తోంది అంటే… గుర్తుకు వచ్చే ఏకైక అంశం… రాజకీయం..!

అవును… ఇండియాలో ఏ పనైనా ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే జరుగుతాయి. దీనికి ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తారతమ్యం లేదు. 120 ఏళ్ళ పైగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి మూడేళ్ళ పసికూన ‘జనసేన’ వరకు… అంతా చేసేది ఓటు బ్యాంకు రాజకీయాలే. దీంతో జీఎస్టీ అన్న మూడక్షరాలు రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారాయి. దేశ భవిష్యత్తును మార్చే అత్యంత కీలక అంశంగా అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ దీనిని కీర్తిస్తుంటే… సామాన్యులను ఇబ్బంది పెట్టే మరో విషయంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. అలాగే బిజెపి వ్యతిరేక శక్తులు నితీష్ వంటి వారు ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి.

నిజానికి ప్రజలలో కూడా ఈ జీఎస్టీపై చాలా సందేహాలు నెలకొన్నాయి. వీటన్నింటికి స్పష్టత రావాలంటే కాలమే సమాధానం చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారుల్లో దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గత డిసెంబర్ లో పెద్ద నోట్ల రద్దు చేసి వ్యాపారస్తులకు చుక్కలు చూపించిన మోడీ, తాజాగా జీఎస్టీతో మరోసారి చావు దెబ్బ కొట్టారని మండిపడుతున్నారు. డిసెంబర్ నుండి వ్యాపార రంగం కుదేలవుతూ, ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతోంది అన్న తరుణంలో… ఈ జీఎస్టీ ప్రభావం వలన మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తొలినాళ్ళల్లో కొంత ఇబ్బందులు సహజం, వాటిని భవిష్యత్తులో పరిష్కరిస్తాం అని కేంద్రం చెప్తోంది.

ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం… ఈ జీఎస్టీ పన్ను విధానం వలన దేశ భవిష్యత్తు ఇప్పటికిప్పుడు మారే అవకాశాలైతే ఏం లేవు. అయితే ప్రజలనందరినీ ఒక సిస్టంకు అలవాటు చేసి, ఎక్కువ మందిని పన్నులు చెల్లించే వారి జాబితాలో చేర్చాలన్నది ప్రభుత్వ తాపత్రయం. ఇక రాజకీయాల దృష్ట్యా అయితే, 2019లో బిజెపి ఏ రేంజ్ లో గెలుపొందుతుందో నిర్ణయించే శక్తిగా జీఎస్టీ మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ పన్ను విధానం ఎక్కువ మంది ప్రజల ఆమోదం పొందితే మాత్రం ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి సింగిల్ గా విజయం సాధించడం అనేది ‘నల్లేరు మీద నడక’లా మారుతుంది. అలా కాకుండా పెద్ద నోట్ల రద్దు మాదిరి తయారైతే మాత్రం… ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చు.

అయితే ఎవరి గోల వారిది అన్నట్టు… ఈ జీఎస్టీలో బొక్కలేంటి? అని అన్వేషించడం మరికొందరి వంతవుతోంది.