KTR - TRSజీహెచ్ఎంసి ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్ట బోయినట్టు అయ్యింది అధికార తెరాస పరిస్థితి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనుండడంతో తెరాస ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి కే తారకరామారావు నిర్వహించారు.

కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు సంక్షేమ కార్యక్రమాల పైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే ఉగాది నుంచి నగర పరిధిలో తాగునీరు ప్రతిరోజు అందించేలా ముందుకుపోవాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈసారి ఎన్నికలలో బీజేపీకి అసలు అవకాశం ఇవ్వకూడదని, తమకు అనుకూలమైన ఫలితాలు రాబట్టి దుబ్బాక, హైదరాబాద్ లో ఫలితాలు బీజేపీకి గాలివాటంగా వచ్చినవని రుజువు చెయ్యాలని ఆరాటపడుతున్నారు.

మరోవైపు… బీజేపీ కూడా ఈ రెండు ఎన్నికల మీద దృష్టి పెట్టింది. వరంగల్ తెరాస కు పెట్టని కోట కావడంతో అక్కడ మెరుగైన ఫలితాలు రాబట్టి తెలంగాణలో భవిష్యత్తు తమదే అని చెప్పాలనుకుంటుంది. వరంగల్ కార్పొరేషన్ గడువు వచ్చే ఏడాది మార్చితో పూర్తి అవుతుంది. దానితో వచ్చే ఏడాది జనవరి తరువాత ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.