Greater Visakhapatnam Municipal Elections 2021నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే నెల 10న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 14న ఫలితాలు వస్తాయి. ఎన్నికలు జరిగే 12 నగరపాలక సంస్థలలో గ్రేటర్ విశాఖ ఒకటి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తరువాత జరగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి.

విశాఖ వాసులలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పెద్ద సిటీ కావడంతో విద్యావంతులు ఎక్కువే. మూడు రాజధానులు అనేవి రాష్ట్ర భవిష్యత్తు కు మంచిదా అనేది వారు విచక్షణతో నిర్ణయించి తమ తీర్పు చెప్పే అవకాశం ఉంది. పైగా పంచాయతీ ఎన్నికల వలే కాకుండా ఇవి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు.

ఇటీవలే తెరమీదకు వచ్చిన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం కూడా ఈ ఎన్నికలలో కీలకం కానుంది. బీజేపీతో పాటు ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ను కూడా దోషిగా చూస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ తరుణంలో వారు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ విషయంలో జరిగే పోరాటాలలో టీడీపీ ముందుంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికి వస్తే… ఏ స్థానిక ఎన్నికలైనా అధికారపక్షానికి ఎంతో కొంత లబ్ది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు కీలకంగా మారనున్నాయని అర్ధం అవుతుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెరుగైన ఫలితాలు వస్తే… మూడు రాజధానులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి విషయాలలో ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది.