జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… ఆయనను 2019 లో ఓడించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని… అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గ్రంధి పవన్ మీద, జనసైనికుల మీద వ్యక్తిగత విమర్శలు చేశారు.

అందుకు ప్రతిగా రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని, కానీ మనం కూడా అదే పని చెయ్యలేం… పిచ్చి కుక్కల కోసం మునిసిపాలిటీ వాన్ వస్తుంది తప్పకుండా అంతవరకు సంయమనం పాటించి వేచి చుడండి అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. దానికి తిరిగి కౌంటర్ ఇచ్చారు గ్రంధి శ్రీనివాస్.

“నన్ను పిచ్చికుక్కల వ్యాన్‌లో వేసి పంపుతామన్నారు.. గత ఎన్నికలలో రెండు చోట్ల అదే వ్యాన్‌లో ప్రజలు మిమ్మల్ని వేసి పంపించారు,” అని ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. నిన్నటి నుండి జనసైనికులు ట్విట్టర్ లో #పిచ్చికుక్కగ్రంధిశ్రీనివాస్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

వచ్చే నెలలో జరిగే మునిసిపల్ ఎన్నికలలో కసిగా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి స్థానిక ఎమ్మెల్యేకు గట్టిగా బుద్ధి చెబుతామని స్థానిక జనసైనికులు సవాలు చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ వివాదం కూడా జనసేనకు మంచి చేసింది అనే చెప్పుకోవాలి.