Grand Welcome to YS Jagan in Vizagఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు అనగా డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించి రాజధానుల ప్రక్రియ మొదలు పెడతారు. అవసరమైతే మూడు రాజధానులు అధికారికం చేస్తూ ఒక ఆర్డినెన్సు కూడా తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనుండడం విశేషం. విశాఖలో రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. రాజధాని ప్రకటన తరువాత జగన్ తొలిసారిగా విశాఖ రానుండడంతో గ్రాండ్ గా స్వాగత ఏర్పాట్లు చెయ్యాలని పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖలో మకాం వేసి ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు జగన్‌కు స్వాగత కార్యక్రమాలు ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయేలా స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహిస్తామన్నారు. మరోవైపు అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళన తొమ్మిదవ రోజుకు చేరుకుంది.

రేపు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అమరావతిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటవారిని ఎవరినీ తమ ఇళ్లలోకి రానివ్వకూడదని అన్ని ఇళ్లకు నోటీసులు జారీ చేసారు. కేంద్రం ఈ విషయంలో కలుగజేసుకుని, ఈ ప్రయత్నాన్ని నిలువరిస్తుందని వారు కోటి ఆశలతో ఉన్నారు.