Grama Volunteer Jobs removingఆంధ్రప్రదేశ్ లో అట్టహాసంగా మొదలైన వాలంటీర్ల వ్యవస్థతో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీరంతా అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే అత్యధికంగా ఉన్నారు.

అయితే పార్టీ క్యాడర్ కోసం అవసరం లేని పోస్టులని తెచ్చి పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా… వలంటీర్ల ఉద్యోగాలు చాలా మందికి మూణాళ్ల ముచ్చటగా ముగియనున్నాయి. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వాలంటీరు సచివాలయం, వార్డు వాలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌. నవీన్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిరాశతో ఉన్న మిగతా కార్యకర్తలకు ఉద్యోగాలు కలిపించడానికే ఈ నిర్ణయం అని పలువురు ఆరోపిస్తున్నారు.

18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారిని తీసెయ్యడం వరకు సబబే కానీ 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తొలగించడం అన్యాయం అని ఉద్యోగాలు కోల్పోతున్న వారు అంటున్నారు. 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఇవి అమలు అయితే ప్రతి జిల్లాలోనూ వందల కొద్దీ వాలంటీర్లు తమ ఉద్యోగాలు కోల్పోతారు.