Gowru Charitha Reddy couple leaving YSRCPగౌరు కుటుంబం – గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకట రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీర విధేయులు. ఆ తరువాత వారు జగన్ వెంట నడిచారు. గత ఎన్నికలలో పాణ్యం నుండి గౌరు చరితా రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఏమైందో ఏమో గానీ ఈ సారి మాత్రం వారికి టిక్కెట్ లేదని చెప్పేశారు జగన్. దీనితో వారు తమ దారి తాము చూసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయి పాణ్యం టిక్కెట్ తెచ్చుకున్నారు. వైకాపా నుండి కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.

ఆయన గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. చివరిలో చంద్రబాబు రాజనీతి ప్రదర్శించి గౌరు కుటుంబం వర్గపోరాటంలో ప్రత్యర్థులుగా ఉన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీనితో గౌరు చరిత గెలవడానికి సులభమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో పాణ్యం ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా సహకరిస్తున్నారు. జనసేన నుంచి చింతా సురేష్ పోటీలో ఉన్నా నామమాత్రమే.

ప్రస్తుత పరిస్థితులు గౌరు కుటుంబానికే అనుకూలంగా ఉన్నాయి. దీనితో గౌరు కుటుంబాన్ని వదులుకుని జగన్ తప్పు చేశారా? అనే ప్రశ్న రాకమానదు. కర్నూల్ జిల్లాలో వీక్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ చేరికలతో పుంజుకుంది. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక కొన్ని సీట్లలో ప్రభావం బానే చూపించింది. ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు.