govt employees rallyఉద్యోగుల ఆగ్రహాన్ని విజయవాడ వేదికగా ప్రభుత్వం రుచి చూసింది. ఈ అశేష జనవాహినిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వామ్యులు కావడం విశేషం. ఈ సందర్భంగా కొత్త పీఆర్సీ ప్రకారం అమలు చేస్తోన్న ‘హెచ్ఆర్ఏ’పై ఓ మహిళా ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పింది వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం హెచ్ఆర్ఏ రూపంలో తమకు ఇస్తోన్న 800 రూపాయలకు వసతి సదుపాయాలను చూపించాలని ఓ మహిళా ఉద్యోగి మీడియా వేదికగా సీఎంకు విన్నవించుకున్నారు.

ఒకవేళ 800 రూపాయలకు ఇల్లు మాకు ఇప్పించగలిగితే, సీఎం మాట మీద మేము నిలబడతామని అన్న సదరు మహిళ, ఒకవేళ అలా చేయలేని పక్షంలో సీఎం సీటు దిగిపోవాల్సిందిగా డిమాండ్ చేసారు. వాళ్లకు మాత్రం 50 వేలు తీసుకుంటారు, మాకు 800 ఇస్తారా? అంటూ నిలదీశారు.

మాకు 30 ఏళ్ళ పాటు సర్వీస్ చేస్తే సరైన పెన్షన్ ఉండదు గానీ, వీళ్ళు అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి 50 వేలు, లక్షలు తీసేసుకుంటారన్న భావనను కాస్త ఘాటుగా వ్యక్తపరిచారు. తెల్లవారుజామున వచ్చిన తమను రోడ్ల మీదే ఆపేసారని, తామేమైనా దొంగలమా? అంటూ ప్రశ్నించారు.

మా హక్కులు సాధించుకోవడానికి వచ్చిన తమను ఇప్పుడు అడ్డుకోగలిగారు గానీ, 7వ తేదీ నుండి చూడండి తామేంటో చూపిస్తామని సదరు మహిళా ఉద్యోగి తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలా ఒకరు కాదు, ఉద్యోగులంతా ఒకే నినాదంతో “సీఎం డౌన్ డౌన్” మారుమ్రోగించారు.