Governor - ESL Narasimhanఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా పదేళ్లకు పైగా గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఐదు ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించి ఇటీవలే రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయనకు బదిలీ లేదా మరో పదవి ఇవ్వవచ్చని, రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఆయనను ఆ తరువాత మోడీ ప్రభుత్వం కూడా కొనసాగించింది.

విజయవాడలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను రాజ్ భవన్ అవసరాలకు వాడుకునే విధంగా రెడీ చేస్తున్నారు. వేరే రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహన్ ను బదిలీ చేయవచ్చని, లేదా కశ్మీర్ కు సలహాదారుగా వాడుకోవచ్చని చెబుతున్నారు. వేరే రాష్ట్రానికి గవర్నర్ గా వేస్తే మాత్రం నరసింహన్ రికార్డు సృష్టించినట్టే. గత కొంత కాలంగా ఆయనను మర్చి రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని బిజెపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నేతలు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగానే కొత్త గవర్నర్ల నియామకం జరగొచ్చని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి సుష్మా స్వరాజ్‌ను గవర్నర్‌గా నియమించినట్టు గత నెలలో సామాజిక మాధ్యమాల్లో ముమ్మురంగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. కొందరు మాత్రం ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు చొరవ చూపుతున్నారు ఈ క్రమం నరసింహన్ ను మరో ఆరు నెలలు కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు.