KCR---Governor-ESL-Narasimhan-గవర్నర్ నరసింహన్ నిన్నమొన్నటిదాకా ఇరు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించారు. ఆయన సదరు ప్రభుత్వాలతో వ్యవహరించే తీరును బట్టి కేంద్రం ఆయా పార్టీలతో ఎలా మెలగాలి అనుకుంటుంది అనేదాని మీద స్పష్టత వచ్చేది. మొన్నటిదాకా తెలంగాణాలో తెరాస ప్రభుత్వానికి బాగా అనుకూలంగా ఉండే గవర్నర్ ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల తరువాత రూటు మార్చారు. బీజేపీ ఇక్కడ అనూహ్యంగా నాలుగు సీట్లు గెలవడంతో ఇక కేసీఆర్ తో స్నేహసంబంధాలు అనవసరం అని అనుకున్నాకా ఈ మార్పు రావడం గమనార్హం.

తాజగా కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్‌ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో..ఇక చేసేది ఏమీ లేక… గవర్నర్‌ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా సదరు బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మొన్న ఆ మధ్య గవర్నర్ ప్రభుత్వం మీద వస్తున్న కొన్ని ఆరోపణలపై అధికారులను పిలిపించుకుని మాట్లాడటం తెలిసిందే. దీనితో గవర్నర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టదలిచిందా అనే అనుమానం కలుగక మానదు. గతంలో చంద్రబాబుకు ఇచ్చిన ట్రీట్మెంట్ లాగే కేసీఆర్ కూ తప్పదా?