Governor Biswabhushan Harichandan CM YS Jagan participated in Constitution Day program నేడు రాజ్యాంగ దినోత్సవం. కనుక ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ మొదలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీలు ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి నేడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిఎం జగన్మోహన్ రెడ్డి మన రాజ్యాంగం గొప్పదనం గురించి నాలుగు ముక్కలు చెప్పి తమ ప్రభుత్వం దానిని ఎంత చక్కగా అమలుచేస్తోందో నొక్కి చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో నొక్కి చెప్పారు.

అయితే గత మూడున్నరేళ్ళుగా ప్రతిపక్షాలను వేధిస్తూ, నిత్యం సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలను బూతులు తిడుతూ, అరసవిల్లికి పాదయాత్ర చేస్తున్న రైతులపై దాడులు చేసి తిప్పి పంపించేసి, అన్ని వ్యవస్థలను అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.

ఇక తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను, ప్రజల గొంతుని కూడా నిర్ధాక్షిణ్యంగా నొక్కేసి, అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం పనికిరాదు కొత్తది రాయాలని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే తప్పకుండా సొంత రాజ్యాంగం వ్రాసి అమలుచేసిన ఆశ్చర్యం లేదు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని ఎన్ని విధాలుగా అవమానిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫోటోకి పూలమాలలు వేసి రాజ్యాంగం గురించి ఉపన్యాసం ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఆయన హయాంలో వరుసగా బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేస్తూ, రాష్ట్రాల హక్కులు హరించివేస్తూ, ప్రశ్నించిన ప్రభుత్వాలపైకి ఈడీ, సీబీఐ, ఐ‌టి శాఖలను ఉసిగొల్పుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈవిదంగా రాజకీయ నేతలందరూ రాజ్యాంగాన్ని నిత్యం అపహాస్యం చేస్తూనే, ఈరోజు దాని గురించి ఉపన్యాసాలు దంచుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పక తప్పదు. ఎవరికీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడం వలననే ఈవిదంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.