Narendra- Modi Dmonetizationబ్లాక్ మనీ నియత్రించే పేరుతో నవంబర్ 8వ తేదీన చేపట్టిన నోట్ల రద్దు వ్యవహారం ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం అంచనాలు దారుణంగా తల్లక్రిందులు కావడంతో, కనీసం ఆర్బీఐకు ఎంత మొత్తంలో కరెన్సీ వచ్చిందో కూడా బదులిచ్చుకోలేని పరిస్థితిలోకి కేంద్రం వెళ్లిపోయింది. ప్రజలు పడ్డ, పడుతున్న కష్టాలు ఒక వైపైతే, దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. అయితే ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా సాగిపోతున్న మోడీ సర్కార్, తాజాగా మరొక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

నగదు లావాదేవీలను కేవలం 3 లక్షలకు పరిమితం చేస్తూ ఇటీవల బడ్జెట్ లో ఒక నిర్ణయం తీసుకోగా, తాజాగా ఈ పరిమితిని కేవలం 2 లక్షలకు కుదిస్తూ ఆర్ధిక సవరణ చేసింది. ప్రజలను నగదు రహిత లావాదేవీల దిశగా ప్రోత్సహించడంతో పాటు, ప్రతీ లావాదేవీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. ఒకవేళ 2 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే, అలా జరిగిన లావాదేవీలపై 100 శాతం జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది.

మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్ధిక లావాదేవీలు పడిపోగా, తాజా నిర్ణయంతో మరింత దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యుల పాలిట శాపంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. మద్య తరగతి ప్రజలు ఎంతో కొంత కూడబెట్టుకుని, భవిష్యత్తు కోసం కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇలాంటి నిబంధనలు విధించి, దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్దామని అనుకుంటున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

బహుశా మళ్ళీ దేశంలో నగదు కొరత వస్తుండడంతో, ఈ నిబంధన అందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారేమో! ఓ పక్కన బ్యాంకులు అమలు చేస్తున్న నిబంధనలతో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు, తమ నగదును బ్యాంకులలో ఉంచడం కన్నా, విత్ డ్రా చేసుకోవడం మేలనే తలంపుతో ఇటీవల కాలంలో భారీ స్థాయిలో విత్ డ్రాలు చోటు చేసుకున్నాయి. దీంతో కరెన్సీ రొటేషన్ లేక మళ్ళీ ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. అలాగే బ్యాంకులలో కూడా నగదు అంతంత మాత్రంగానే ఉంటోంది.

మరి ఏ ఆలోచనలతో మోడీ సర్కార్ అమలు చేస్తున్నారో గానీ, ఈ కఠిన నిర్ణయాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన విద్యుత్, మున్సిపల్ వంటి పన్నులు కూడా కట్టకుండా ఎగ్గొట్టే బిగ్ షాట్స్ ను ఏమీ చేయలేకపోతున్న కేంద్రం, సామాన్య ప్రజలపై తమ తడాఖా చూపుతుండడం శోచనీయం. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే, బ్యాంకులకు రుణాన్ని ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకు కొన్ని వేల కోట్లు మాఫీ చేయడంపై ప్రజలు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు.

బ్లాక్ మనీని నియత్రించేందుకు మా ప్రభుత్వం ఏమీ చేయలేదు అనిపించుకునే కన్నా, ఇలా ఏదొకటి చేసాము అని చెప్పుకునేందుకు బహుశా ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నారేమో అన్న భావన ప్రజలలో వ్యక్తమవుతోంది. పన్నులు కట్టాలన్న అవగాహన ప్రజలలో కల్పించడం మంచిదే గానీ, అది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చేయకూడదన్న విషయాన్ని మోడీ మరిచినట్లున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు సంవత్సరాలు వేచిచూడాల్సిందే.