Governtment employees fires on YS Jagan government over salariesకరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు.. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ విషయంలో ప్రభుత్వం కొందరికి వెసులుబాటు కలిపించింది. వేతనాల కోత నుంచి ఈసారి పింఛనుదారులకు మినహాయింపు ఇచ్చింది. గత నెలలో వారికి 50 శాతం పింఛను మాత్రమే ఇవ్వగా ఈనెల 100శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఈ సారికూడా 50 శాతం వేతనాలు మాత్రమే అందుకునే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వానికి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు దొరుకుతాయి… మా వేతనాల విషయంలోనే ఆర్ధిక ఇబ్బందులు గుర్తుకు వస్తాయని వారు ఆరోపిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారు ఆరోపిస్తున్నారు.

వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, పింఛనుదారుల వరకూ ఒకే… సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని వారు అంటున్నారు. రెండు నెలల పాటు 50% వేతనాలు ఇస్తే తమకు చాలా ఇబ్బంది అని వారు చెప్పుకొస్తున్నారు.