Governer Narasimhan - Chandrababu Naidu - KCRవిభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరొకసారి కలుసుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ సారథ్యంలో 17వ తేదీన సోమవారం నాడు వీరిద్దరూ భేటీ కానున్నారు. పెండింగ్‌ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ సమక్షంలో చర్చించనున్నారు. ఏపీ సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం తదితర అంశాలపై ఇరువురు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అలాగే విద్యుత్, సచివాలయ ఉద్యోగుల విభజన, అస్తుల పంపకంపై కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇవే అంశాలపై గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఇప్పటివరకు మూడుసార్లు చర్చించగా, ఆ చర్చల్లో తేలిన అంశాలను మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ కలిసి గవర్నర్ సమక్షంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే.