Gossips on Comedian Viajy sai suicideగతంలో ఎన్నడూ లేని విధంగా టాప్ సెలబ్రిటీలు సైతం ఇటీవల కాలంలో సోషల్ మీడియాపై, యూ ట్యూబ్ వీడియోలపై ఓపెన్ గానే మాట్లాడుతూ మండిపడుతున్నారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. జరిగిన వాస్తవానికి, యూ ట్యూబ్ లో పెడుతున్న వీడియో టైటిల్స్ కు, ఫోటోలకు ఎక్కడా పొంతన లేకుండా ఉండడమే సదరు సెలబ్రిటీల ఆవేదనకు ప్రధాన కారణం.

ఉదాహరణకు తాజాగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు సంబంధించిన న్యూస్ ను యూ ట్యూబ్ వీడియోలలో సంబంధం లేకుండా ప్రతిబింబించారు. విజయ్ ఆత్మహత్యకు – జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు సంబంధం ఉందా? దీనిపై అసలు జూనియర్ స్పందించారా? అంటే కాదనే సమాధానమే వెలువడుతుంది.

కానీ యూ ట్యూబ్ లో మాత్రం “విజయ్ ఆత్మహత్యను కాపాడలేకపోయా… అని జూనియర్ ఎందుకన్నాడు…” అంటూ ఓ టైటిల్ పెట్టి వీడియోను పోస్ట్ చేసారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ క్షణాల్లోనే ఇది వైరల్ అవుతూ వారికి కావాల్సిన మిలియన్స్ క్లిక్స్ ను అవలీలగా అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “ఫేక్”ను విపరీతంగా స్ప్రెడ్ చేయడంలో సదరు వీడియోలు నిమగ్నమవుతున్నారు.

ఒక్క విజయ్ సాయి ఆత్మహత్య విషయంలోనే కాదు, టాలీవుడ్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, దానికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో పుట్టుకొస్తాయి. టైటిల్స్ ఆకర్షణగా ఉంటాయి గనుక క్లిక్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి, దీంతో ప్రజల్లోకి అది బాగా వెళిపోతోంది. అందుకే సెలబ్రిటీలంతా యూ ట్యూబ్ లో పెడుతున్న టైటిల్స్ మరియు వీడియోలపై తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

ఇక హీరోయిన్ల ఎఫైర్ల విషయంలో అయితే కొదవే లేదు. ఏ మాత్రం సంబంధం లేకుండా ఆ హీరోయిన్ ఇలా… ఈ హీరోయిన్ అలా… అంటూ అసభ్యకరమైన టైటిల్స్, లింక్ లు పెట్టడమైతే షరామామూలే. తొలినాళ్ళల్లో వీటిని లైట్ గా తీసుకున్నారు కానీ ఇలాంటి వీడియోలకు మిలియన్ సంఖ్యలో క్లిక్స్ వస్తుండడంతో, ప్రస్తుతం సెలబ్రిటీలంతా కంగారు పడుతున్నారు. అయినా డిజిటల్ మీడియాను ఈ రకంగా వినియోగించుకోవడం శోచనీయమే!