Gosala_Destruction_in_Vijayawadaవైసీపీ ప్రభుత్వం సచివాలయాలకు, చివరికి ట్రాన్ఫార్మర్ దిమ్మలకు తమ పార్టీ రంగులను వేసుకోవడాన్ని అది సమర్దించుకొని ఉండవచ్చు కానీ విజయవాడలో ఓ బ్రాహ్మణ కుటుంబం తమ ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని సుమారు డజనుకి పైగా ఆవులను పోషిస్తుంటే, దానిని కూల్చివేయడానికి వారిపై ‘టిడిపి మనుషులు’ అనే ముద్రవేయడం విస్మయం కలిగిస్తుంది.

విజయవాడలోని ఓ బ్రాహ్మణ కుటుంబం చాలా కాలంగా గోవులను సాకుతోంది. గోవుల సంతతి పెరుగుతుండటంతో తమ ఇంటినే గోశాలగా మార్చేసి శ్రీగురుకృప గోశాల పేరుతో ఆవులను సాకుతున్నారు. అప్పటి నుంచి స్థానిక వైసీపీ నేతలు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని వేదిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ నేతల ఆదేశం మేరకు మునిసిపల్ సిబ్బంది గోశాలలోకి జొరబడి కూల్చివేయడం ప్రారంభించారు.

అప్పుడు ఆ బ్రాహ్మణ కుటుంబం టిడిపి నేత బోండా ఉమాను ఆశ్రయించగా ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకొని కూల్చివేతను నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఆయన మునిసిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా గోవులు లోపల ఉండగా ఏవిదంగా కూల్చివేస్తున్నారని నిలదీశారు. అసలు ఎవరి ఆదేశం మేరకు వచ్చారో చెప్పాలని గట్టిగా నిలదీసేసరికి వారు చల్లగా అక్కడి నుంచి జారుకొన్నారు.

అనంతరం ఆ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు బోండా ఉమాకు తమ గోడు మొరపెట్టుకొన్నారు. తాము టిడిపికి చెందినవారమని స్థానిక వైసీపీ నేతలు వేదిస్తున్నారని, ఏదో రోజు గోశాల కూల్చివేయిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బోండా ఉమా వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఏం టిడిపిలో ఉన్నవాళ్ళు మనుషులు కారా? ఈ రాష్ట్ర పౌరులు కారా?” అని ప్రశ్నించారు. గోశాల ప్రధాన ద్వారం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసారి ఎవరైనా మిమ్మల్ని వేదిస్తే తక్షణం తనకు ఫోన్‌ చేయమని చెప్పారు. అవసరమైతే పోలీస్ కమీషనర్‌తో మాట్లాడుతానని బోండా ఉమా ఆ బ్రాహ్మణ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

వైసీపీ పాలనలో సామాన్య పౌరులు సైతం ఈవిదంగా భయంభయంగా బ్రతకాల్సిన దుస్థితి దాపురించడం చాలా బాధాకరమే కదా?