Rama Banam Movieఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేసిన సన్నివేశాల గురించి ఫ్యాన్స్ లో చాలా ఆసక్తి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక అలాంటివేమైనా ఉంటే ఆన్ లైన్లో వదలమని అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ రాజమౌళి సీరియస్ గా తీసుకోలేదు. ఇదే కాదు స్టూడెంట్ నెం 1 నుంచి బాహుబలి దాకా అలా చేసిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ విచిత్రంగా డిజాస్టర్ గా స్టాంప్ వేయించుకున్న రామబాణంలో లేపేసిన సీన్లన్నీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ యూట్యూబ్ లో వరసబెట్టి వదిలేస్తోంది.

మొత్తం కలుపుకుంటే ఇప్పటిదాకా ఈ ఫుటేజీ ఇరవై నిముషాలు దాటేసింది. ఇంకెన్ని పోస్ట్ చేస్తారో తెలియదు. పోనీ అవేమైనా బాగున్నాయా అంటే ఏ మాత్రం అవసరం లేనివని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. తీసిందే పరమ రొటీన్ కథ. అందులో మళ్ళీ ఇలాంటివి ఎలా రాసుకున్నారని ఓపెన్ గానే కామెంట్లు పెడుతున్నారు. హీరో గోపిచంద్ సైతం రిలీజ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వృథా ఖర్చు చాలా జరిగిందని నిర్మాతలు సహకరించే వాళ్ళు దొరకడం తమ అదృష్టమన్నట్టుగా శ్రీవాస్ గురించే అన్నారు.

షూటింగ్ సాంకేతిక ఎంత డిజిటలైనా మేకింగ్ కు సంబంధించిన వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అసలు తీయాలా వద్దానేది స్క్రిప్ట్ దశలోనే దర్శకుడు క్లారిటీతో ఉండాలి. దశాబ్దాల క్రితం రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ ని నాలుగంటలకి పైగా లెన్త్ తో అలాగే థియేటర్ రిలీజ్ చేశారు. కట్ చేస్తే రెండో ఇంటర్వల్ కే జనం లేచి వెళ్లిపోయారు. అంత బోర్ కొట్టేసింది. సినిమా ఫ్లాప్ కావడం వల్ల వచ్చిన నష్టాల్లో కెమెరా రీళ్ల ఖర్చే అధికం. కాలానుగుణంగా ఆడియన్స్ అభిరుచులను పసిగట్టకపోతే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి.

డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నాడు కదాని రాసుకున్నదంతా తీస్తే ఇలాగే ఉంటుంది. రామబాణం పేపర్ మీద విన్నప్పుడే రెగ్యులర్ అనిపించే ప్లాట్. అలాంటిది పసలేని జోకులతో, ఏదో ఆర్టిస్టులు తమ టైమింగ్ తో మేనేజ్ చేస్తారనే భ్రమతో పదేళ్లు వెనక్కు వెళ్లి ట్రాక్స్ రాసుకుంటే ఇంతకన్నా అవుట్ ఫుట్ ని ఏం ఆశించగలం. అసలు ఒక ఫ్లాప్ మూవీకి రెండో వారంలోనే ఇన్నేసి డిలీట్ సీన్లను వదలడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉద్దేశం దర్శకుడి లోపాలను ఎత్తి చూపడమా లేక మరో కారణమా అనేది ఎవరికి వారు విశ్లేషించుకునే క్రమంలో అర్థం చేసుకోవాలి.