gopalapuram constituency ycp leaders went to temple in support of three capitalsఎవరైనా తమ సమస్య తీరాలనో లేదా తమ కోరికలు తీరాలనో దేవుడికి మొక్కులు మొక్కుతుంటారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఏర్పడాలని కోరుతూ రాజధాని రైతులు అరసవిల్లి సూర్యనారాయణమూర్తికి మొక్కుకొనేందుకు పాదయాత్ర చేస్తున్నారు. దారిలో ద్వారకా తిరుమలతో సహా అన్ని ఆలయాలలో మొక్కుతూ ముందుకు సాగుతున్నారు. వారిచేతిలో పదవులు, అధికారం రెండూ లేవు… జగన్ ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు కనుక వారు తమ గోడును దేవుడికి మొరపెట్టుకొంటున్నారు. దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు కనుక వారిని తప్పు పట్టడానికి లేదు.

కానీ చేతిలో పదవులు, ఎవరూ ప్రశ్నించలేని అధికారం అన్నీ ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మూడు రాజధానుల కోసం గుళ్ళకు వెళ్ళి కొబ్బరికాయలు కొడుతుండటమే విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడే వారు తమ అధినేత అభీష్టం మేరకు మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక గుళ్ళకు వెళ్ళి కొబ్బరికాయలు కొడుతుంటే మరెప్పుడు చేస్తారు?అనే సందేహం కలుగుతుంది.

మన ఆలోచన సరైనదైతే పైనున్న ఆ దేవుడు కూడా తోడ్పడతాడు. పైసా ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వం రాజధాని కోసం 36 వేల ఎకరాలు సేకరించడమే అందుకు ఓ గొప్ప ఉదాహరణ. కనుక వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు దేవుడి ఆశీస్సులు ఉంటే ఈ మూడున్నరేళ్ళలో ఏర్పడి ఉండాలి కానీ నేటికీ ఆ దిశలో ఒక్క అడుగు ముందుకు వేయలేని దుస్థితి నెలకొంది. కనుక వైసీపీ నేతలు కూడా దేవుళ్ళని ఆశ్రయించి మొక్కులు మొక్కుతున్నారు.

అయితే వైసీపీలో ఉండే అతిపెద్ద లోపం ఏమిటంటే చేసే ఏ పనిలోనూ చిత్తశుద్ధి ఉండదు. ఆనాడు సమైక్యాంద్ర ప్రదేశ్ ఉద్యమాలలో అంతే… ఆ తర్వాత ప్రత్యేక హోదా దీక్షలలో అంతే… తర్వాత సంక్షేమ పధకాలు, మూడు రాజధానులలోనూ అదే వైఖరి.

సంక్షేమ పధకాలతో ప్రజలకు మేలు చేయాలనే తపన కంటే వాటితో ఓట్లు రాబట్టుకోవాలనే యావే ఎక్కువ. అదే గడప గడపలో కనిపిస్తోంది. మూడు రాజధానుల కోసం వైసీపీ నేతల మొక్కులలో కూడా చిత్తశుద్ధి లేదు. అమరావతి ఏర్పడాలని రాజధాని రైతులు మొక్కులు మొక్కుతున్నందున వారికి ధీటుగా తాము హడావుడి చేయాలే దురాలోచనతోనే మొక్కులు మొక్కుతున్నారు.

ఆత్మశుద్ధి లేని ఆచారమేల?చిత్తశుద్ధి లేని శివపూజలేలయా?అన్నారు. దేవుడి పూజలను కూడా రాజకీయ కారణాలు, ఆలోచనలతోనే చేస్తున్నప్పుడు వారికి ఇక భగవంతుడి ఆశీస్సులు ఎలా లభిస్తాయి?అందుకే మూడున్నరేళ్ళుగా ఏమీ చేయలేకపోయారు. కనుక మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మిగిలిన ఈ 19 నెలలో ఏర్పాటు చేసి చూపాలి. లేకుంటే ప్రజలు వైసీపీకి మరో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించారంటే చెప్పుకొనేందుకు ఏమీ ఉండదు.