Google Biggest Campus in HYDఅంతర్జాతీయ సంస్థ గూగుల్ అమెరికా బయట అతి పెద్ద కార్యాలయానికి హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకొంది. గచ్చిబౌలిలో 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ అతిపెద్ద భవనానికి తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ గురువారం భూమిపూజ చేశారు.

భారత్‌లో ముంబై, బెంగళూరు, గుర్‌గావ్, హైదరాబాద్‌లో ఇప్పటికే గూగుల్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ లీజ్ తీసుకొన్న భవనాలలో నడుస్తున్నాయి. కనుక ఒకవేళ శాస్విత భవనం నిర్మించుకోవాలని గూగుల్ నిర్ణయించుకొన్నప్పుడు ముంబై, బెంగళూరు వంటి అతిపెద్ద నగరాలను ఎంచుకోవచ్చు కానీ హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకొంది.

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ భారత్‌లో పెద్ద నగరాలను కాదని హైదరాబాద్‌ను ఎంచుకోందంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, రాజకీయ సుస్థిరత, వ్యాపార అవకాశాలు, నిపుణులు అందుబాటులో ఉండటం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొంటుందని వేరే చెప్పక్కరలేదు.

హైదరాబాద్‌కు క్యూ కడుతున్న చిన్నా పెద్దా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ వైపు కనీసం తొంగి చూడటం లేదు ఎందుకు? అందుకు మన పాలకులు బాధపడుతున్నట్లు కూడా లేదు! నేటికీ ఉన్నత విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హైదరాబాద్‌ లేదా బెంగళూరుకు వెళ్ళక తప్పడం లేదు. ఇదీ మన పాలకులకు అవమానంగా అనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది.

తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఏపీలో 5 విమానాశ్రయాలు ఉన్నాయి. అదనంగా ఏపీకి సుదీర్గమైన సముద్రతీరం ఉంది. విదేశాలకు ఎగుమతి దిగుమతులకు వీలుగా నౌకాశ్రయాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చక్కటి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రానికి ఆనుకొని చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, వాటిలో ఇప్పటికే అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూములు, సాగునీటి సౌకర్యం, మంచి పంటలు పండించగల రైతులు ఉన్నారు.

ఇంజనీరింగ్, నిర్మాణ, కాంట్రాక్, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాలలో కొమ్ములు తిరిగినవారందరూ ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు వారిపైన ఆధారపడ్డాయి. కనీసం వారిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతోంది? ఇన్నిసానుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఎందుకు రావడం లేదు? గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు ఏపీకి రావడం లేదు?అన్నీ జవాబులు దొరకని ప్రశ్నలే! అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో?