tdp mlas met crda srikanthభూసేకరణ’ అన్న పదం ఎక్కడ వినిపించినా పర్వాలేదు గానీ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి గ్రామాల్లో వినపడితే మాత్రం కాస్త ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ‘భూసేకరణ’ అన్న ప్రతిసారి ఏదొక సంచలన విషయం నమోదవుతోంది. మొదటి సారి రైతులు కోర్టు మెట్లు ఎక్కగా, రెండవ సారి పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుపడింది. అలాగే మరోసారి ఏకంగా ముఖ్యమంత్రితో పవన్ భేటీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ‘భూసేకరణ’కు ప్రభుత్వం దూరం కావాల్సిందిగా కోరారు. ఇలా పలు సందర్భాలలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, ఇక సంశయించేది లేదని తేల్చేసింది. దీంతో మరో 10 రోజుల్లో తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలకు చెందిన దాదాపు 650 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ అవనుంది.

సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేసి ఫైల్ ను కలెక్టర్ కు పంపించారు. అధికారులతో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సమీక్షలు చేసిన కలెక్టర్ మరో మూడు రోజుల్లో భూసేకరణకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. రైతులు కోర్టులను ఆశ్రయించే ఆవకాశం ఉందని తెలియడంతో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఈ సారి భూసేకరణ తప్పదని తేలిపోయింది. ఈ సారి పవన్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు.

ప్రస్తుతం ‘భూసేకరణ’ అంశం రాజధాని గ్రామాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, నవులూరు, బేతపూడి గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూసమీకరణకు గతేడాది ఫిబ్రవరితోనే గడువు ముగిసిపోయినప్పటికీ, ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రజలను స్వచ్చంధంగా ముందుకు రావాలని కోరింది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు కొద్ది భూమి మాత్రమే ప్రభుత్వానికి ప్రజలు అప్పగించారు. మరి భూసేకరణ అంశం ఎన్ని మలుపులు తీసుకుంటుందో రాబోయే రెండు వారాల్లో తెలుస్తుంది.