Tobacco Campaign, Tobacco No Smoking Campaign, Tobacco No Smoking Campaign Movie Theatres, Tobacco No Smoking Campaign Stopped, No Tobacco Ad Movie Theatresచిన్న, పెద్ద… స్టార్ హీరో, కొత్త హీరో… తెలుగు, డబ్బింగ్… మల్టీప్లెక్స్, మాస్ కాంప్లెక్స్… అన్న ఎలాంటి తారతమ్యాలు లేకుండా… ఏ సినిమాకు ఎలాంటి సినిమా ధియేటర్ కు వెళ్ళినా… సినిమా కంటే ముందుగా ప్రేక్షకులకు దర్శనమిచ్చేది… ‘పొగాకు’కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. గత కొన్నేళ్ళుగా ప్రదర్శితం అవుతోన్న ఈ యాడ్ ని చూసి ఎంత మంది మారారన్నది ప్రశ్నార్ధకమే? మరో పక్కన నానాటికి పొగాకు, మద్యం అమ్మకాలు తారాస్థాయిలో వృద్ధి చెందుతున్నాయి.

ఇలా… ‘ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరో వైపు పొగ…’ అంటూ ప్రదర్శితమయ్యే పొగాకు హెచ్చరికల పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్న వైనం తెలిసిందే. ఎప్పుడో ఒకసారి సినిమాను చూసే ప్రేక్షకులు ఈ యాడ్ ని భరించగలరేమో గానీ, నిత్యం ధియేటర్ల చుట్టూ తిరిగే సినిమా పిచ్చోళ్ళకు మాత్రం ఇదొక హింస మాదిరిగానే ఫీల్ అవుతున్నారు. అయితే తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో ఓ కమిటీ అధ్యయనం చేయాలని నియమించింది. తాజాగా ఆ కమిటీ నివేదిక సినిమా ప్రేక్షకులకు అనుకూలంగా రావడం మరింత సంతోష దాయకమైన విషయం.

సినిమాకు ముందు పొగాకు యాడ్ దృశ్యాలు ప్రదర్శించవద్దని, దీని స్థానంలో ఓ ఫోటోను చూపిస్తే సరిపోతుందని ‘సినిమా సంస్కరణల’పై నియమించిన శ్యామ్ కమిటీ పేర్కొంది. కుటుంబంతో కలసి సరదాగా ఓ సినిమాకు వెళ్లిన వేళ, చిత్రం ప్రారంభ సమయంలో, ఆపై విశ్రాంతి తరువాత వచ్చే పొగాకు వ్యతిరేక షార్ట్ ఫిల్మ్ లు, చిత్రంలో మద్యపాన, ధూమపాన సన్నివేశాల వేళ, డిస్టర్బ్ చేసే హెచ్చరికలను తొలగించాలని ఈ కమిటీ మోడీ సర్కారుకు సిఫార్సు చేసింది.

ఆరోగ్య శాఖ ఆమోదించిన ఓ ఫోటోను చూపుతూ, కొన్ని సెకన్ల పాటు బ్యాక్ గ్రౌండ్ ఆడియో వినిపిస్తే సరిపోతుందని చెప్పింది. దీన్ని అన్ని భాషల్లోనూ తయారు చేసి సినిమా ప్రారంభ సమయంలో వినిపిస్తే చాలని పేర్కొంది. అలా అంగీకరించని పక్షంలో తమ చిత్రంలోని ఓ నటుడితో పొగాకుకు వ్యతిరేకంగా ఓ చిన్న షార్ట్ ఫిలిం తీసి దాన్ని మాత్రమే చిత్రం ముందు ప్రదర్శించే వెసులుబాటును నిర్మాతకు కల్పించాలని కోరింది. దీని వల్ల ప్రేక్షకులు కూడా కొంత రిలీఫ్ గా ఫీలవుతారని పేర్కొంది.

చిత్రంలో ప్రతి స్మోకింగ్ లేదా డ్రింకింగ్ సీన్ ముందు వచ్చే హెచ్చరికలు, సినిమాలో లీనమైపోయిన వారిని ఆ అనుభూతి నుంచి దూరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డ కమిటీ, ఈ తరహా సీన్ల ముందు హెచ్చరికను తీసివేయాలని సూచించింది. అలాగే సినిమాల్లో జంతువుల వాడకం తప్పనిసరని, ఎంపిక చేసిన జంతువులను వాడుకునే వెసులుబాటును నిర్మాతలకు దగ్గర చేయాలని కూడా సిఫార్సు చేసింది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకుని, కేర్ టేకర్లను నియమించుకుని తర్ఫీదు పొందిన జంతువులను షూటింగుకు వాడుకునేందుకు అంగీకరించాలని సూచించింది.

కాగా, ఆరోగ్య శాఖ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు ప్రకటనలను చూపుతూ, చిత్రం నిడివి పెరిగి, ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని వాపోతున్న నిర్మాతలకు బెనగళ్ సిఫార్సులు కొంత ఆనందాన్ని కలిగించేవేనని సినీ పండితులు వ్యాఖ్యానించారు. మోడీ క్యాబినెట్ ఈ సిఫార్సులను ఆమోదిస్తే, సిల్వర్ స్క్రీన్ పై పొగాకు వ్యతిరేక ప్రకటనల హడావుడి తగ్గి, ప్రేక్షకులకు కొంత ఉపశమనం లభించినట్లయ్యింది.