Gollapudi -Maruthi Rao No Moreప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు వివిధ కళారంగాల్లో తనదైన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు.

రచయితగా, నటుడుగా, జర్నలిస్ట్‌, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించారు. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన 290కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో లీడర్ సినిమాలో ఆయన చేసిన పాత్ర అందరికీ గుర్తు ఉండిపోయేదే. 44

సమకాలీన విషయాలపై రాజకీయాలపై కూడా ఆయన విశ్లేషణలు చేస్తుండే వారు. కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.

ఆ తరువాత అంత్యక్రియలు జరుపుతారు. గొల్లపూడి మృతి సినీ, సాహిత్య రంగానికి తీరని లోటు అనే చెప్పుకోవాలి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.మిర్చి9, పాఠాలకులతో కలిసి ఆయన మరణానికి చింతిస్తూ వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము.