golla babu rao said I am not an innocent but violent person alsoవైసీపిలో మంత్రి పదవి ఆశించి భంగపడినవారు ఇంకా అధిష్టానం మీద భగభగమండుతూనే ఉన్నారు. అది సహజమే కానీ ఆ కోపంలో తమ ముసుగులు తీసేసి ప్రజలకు తమ అసలు రూపాలు చూపిస్తుండటమే విశేషం.

తాజా మాజీ అనిల్ కుమార్‌ “ఇప్పుడు నేను కళ్ళెం తీసిన గుర్రాన్ని ఏమైనా చేయగలను…”అని నెల్లూరులో బహిరంగ సభ పెట్టి ప్రకటించగా, మంత్రి పదవి ఆశించి భంగపడిన పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గ్రామవాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నప్పుడు తన విశ్వరూపం ఏవిదంగా ఉంటుందో స్వయంగా మీడియాకు వివరించారు.

గొల్ల బాబూరావు విలేఖరులతో మాట్లాడుతూ, “నేను అందరితో చాలా మర్యాదగా ఉంటాను కనుక నన్ను అమాయకుడినని మా పార్టీ పెద్దలు భావించినట్లున్నారు. కానీ నేను హింసావాదిని. ఈవిషయం స్టేజి మీద నిలబడి కూడా చెప్పగల ధైర్యం నాకుంది. అలా చెపితే పోలీసులు నాపై కేసు పెట్టినా నేను భయపడను. అనాడు రాజశేఖర్ రెడ్డి చనిపోయారనే సానుభూతితోనే నేను వైసీపీలో చేరాను. అప్పటి నుంచి జగనన్న సైనికుడిలా పనిచేస్తున్నాను. మంత్రివర్గ విస్తరణకు ముందు నేను వందలమంది అనుచరులతో కలిసి కార్లు వేసుకొని వెళ్ళి సజ్జలను కలిసి, నేను మంత్రి పదవికి అర్హుడినని గట్టిగా చెప్పాను కూడా. అయినా నన్ను అమాయకుడిగా జమకట్టి నాకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అవకాశం వచ్చినపుడు నేనేమిటో వారికి చూపిస్తాను. నన్ను దెబ్బ తీసినవారిని నేను కూడా తప్పకుండా దెబ్బ తీస్తాను,” అని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

బూతుల మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకొన్న కొడాలి నాని పదవి కోల్పోయిన తరువాత కాస్త హుందాగా మాట్లాడటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. తన వంటివారికి పదవులు ముఖ్యం కాదని, సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీయే ముఖ్యమని అన్నారు. అయితే ఈ హుందాతనాన్ని ఆయన ఎన్ని రోజులు ఉగ్గబట్టుకోగలరో చూడాలి.