golden opportunity for ys jagan special statusవిభజన సమస్యలు చర్చించేందుకు ఈ నెల 17వ తేదీన కేంద్రం రాష్ట్రాన్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత విభజనలో సమస్యలు అనేకం ఉన్నాయని కేంద్రం గుర్తించడం గొప్ప విషయం. విభజన సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడగకున్నా, కేంద్రం చొరవ తీసుకుని ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావడం శుభపరిణామం.

అయితే ఇందులో “స్పెషల్ స్టేటస్” గందరగోళం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ముందుగా ప్రత్యేక హోదాను చేర్చి, ఆ తర్వాత వైసీపీ హంగామాతో ఎజెండా నుండి స్పెషల్ స్టేటస్ ను తొలగించింది. దీంతో ముగిసిపోయిన అధ్యాయం అనుకున్న స్పెషల్ స్టేటస్ అంశం మరోసారి మీడియా వర్గాల వేదికగా చర్చలు జరుగుతున్నాయి. కొసమెరుపేమిటంటే, కేంద్రం పలికే వరకు అసలు ప్రత్యేక హోదాపై రాష్ట్రం ఆలోచనలు చేయకపోవడం.

ఇదిలా ఉంటే కేంద్రం చూపిన చొరవ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఓ వరంలా మారింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ కావడంతో మళ్ళీ ఈ అంశంపై రగడ రాజుకుంది. దీనిని హైలైట్ చేసుకుంటూ జగన్ గనుక రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే, ప్రస్తుతం రాష్ట్రంలో వినపడుతోన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు ఖచ్చితంగా బ్రేక్ వేసినవారవుతారు.

ఈ నెల 17వ తేదీన జరగబోయే చర్చలలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చే విధంగా కేంద్రం పైన జగన్ ఒత్తిడి తీసుకురాగలిగితే, రాష్ట్ర ప్రజానీకం మరోసారి జగన్ కు నీరాజనాలు పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక హోదా అంశం చర్చలలో లేకుంటే తాము పాల్గొనలేమని ఖరాఖండిగా చెప్పినా, ప్రజల దృష్టిని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న వారవుతారు.

అయితే అంతటి సాహాసం జగన్ మోహన్ రెడ్డి చేయగలరా? ఎందుకంటే, అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడేళ్లు కావస్తోంది. ఇప్పటివరకు కేంద్రానికి వ్యతిరేకంగా గానీ, రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు గానీ, మరే ఇతర సదుపాయాల గురించి గానీ ఓ ముఖ్యమంత్రిగా కనీసం జగన్ అడిగింది లేదు. ఇలాంటి పరిస్థితులలో కేంద్రానికి ఎదురొడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయగలుగుతారా?

ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తన కేసుల గురించి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ మాట్లాడడం లేదని, కేంద్రాన్ని ఏ మాత్రం డిమాండ్ చేయలేకపోతున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు టీడీపీ అండ్ కో తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు గనుక స్పెషల్ స్టేటస్ అంశాన్ని సాకుగా చూపి కేంద్రంపై జగన్ దండెత్తితే ప్రతిపక్షాలు చేస్తోన్న ఈ విమర్శలకు కూడా విలువ లేకుండా పోతుంది.

‘ప్రత్యేక హోదా’ రూపంలో బంగారం లాంటి అవకాశం ప్రస్తుతం జగన్ చెంతకు చేరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఇటీవల బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా కేంద్రం స్వయంగా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా జగన్ కు అత్యంత అనుకూలంగా మారుతుంది.

చిత్తశుద్ధితో నిజంగా పోరాటం చేస్తే కేంద్రం ఇవ్వొచ్చు, లేకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం ఆ పోరాటాన్ని గుర్తిస్తారు, దానికి అనుగుణంగానే తీర్పులు ఇస్తారు. ‘పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప’ అన్న నానుడిని అనుసరిస్తారో లేక గత మూడేళ్ళ మాదిరే ఏ పోరాటం చేయకుండా నిర్లిప్తత వహిస్తారో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంది.