Nara Lokeshఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్:1 ఉద్దేశ్యంపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ స్టే విధించడంతో దానిని గట్టిగా వెనకేసుకొస్తున్న వైసీపీ మంత్రులకి తల కొట్టేసిన్నట్లయింది. దానిపై ప్రతిపక్షాల విమర్శలని, వాదనలని బలంగా తిప్పి కొట్టగలిగారు కానీ హైకోర్టు ఉత్తర్వులపై ఎవరూ కిక్కురుమనలేదు. అనలేరు కూడా!

కనుక రాష్ట్ర ప్రభుత్వం దానిపై కాస్త ఓపికగా వేచి ఉండి హైకోర్టు తదుపరి విచారణ చేపట్టినప్పుడు తన వాదనలు బలంగా వినిపించి స్టే ఎత్తివేయించుకోవచ్చు. కానీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్ధించింది. ఆ పిటిషన్‌ నిన్న లిస్టింగ్ అయినప్పటికీ విచారణకు రాలేదు. బహుశః నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

అయితే దానిపై ఓ పక్క హైకోర్టులో విచారణ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించింది? అంటే ఈ నెల 27వ తేదీ నుంచి తమ పార్టీ నాయకుడు నారా లోకేష్‌ పాదయాత్రని అడ్డుకోవడం కోసమే అని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలతో ప్రజలు టిడిపి, జనసేనలవైపు ఆకర్షితులవుతున్నారని వైసీపీ నేతలకి భయం పుట్టుకొంది. ఇప్పుడు నారా లోకేష్‌ కూడా పాదయాత్ర ప్రారంభిస్తే ప్రజలకి టిడిపి మరింత దగ్గరవుతుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం హడావుడిగా జీవో నంబర్:1పై సుప్రీంకోర్టుని ఆశ్రయించిందని టిడిపి నేతలు వాదిస్తున్నారు.

ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వులని సమర్ధించినా లేదా ఈ కేసుని హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పినా ఈ కేసు విచారణ మరింత ఆలస్యం కావడం, సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి మరో చెంపదెబ్బ అవుతుందని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.