తమిళనాడు రాజధాని చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2018లో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి ఘోరమైన అవమానం జరిగిందనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కర్ణాటక ఎన్నికలలో లబ్ది కోసం కేంద్రం ఉద్దేశపూర్వకంగా కావేరీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయలేదని తమిళులు ఆందోళన చేస్తున్నారు.
మోడీ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే నిరసనకారులు విమానాశ్రయం నుంచి డిఫెన్స్ ఎక్స్పోకు వెళ్లే దారిలో నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. ఆందోళనల వల్ల నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీంతో ప్రధాని ఎక్కడా రోడ్డు మార్గంలో వెళ్లలేదు. చెన్నై విమానాశ్రయంలో ఎయిర్ఫోర్స్ విమానంలో దిగిన మోదీ హెలికాప్టర్లో నేరుగా మల్లాపురంలో ఎక్స్పో జరుగుతున్న వేదిక వద్ద దిగారు. ఆందోళనలు చేపట్టిన దాదాపు 200మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనితో నిరసనకారులు మోడీ గో బ్యాక్ అంటూ రాసి ఉన్న నల్ల బుడగలు ఎగరేశారు. పలుమార్లు మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రూట్ మార్చాల్సి వచ్చింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఇదే ఆయనకు జరిగిన అతిపెద్ద పరాభవం అనే చెప్పుకోవాలి. జయలలిత మరణం అనంతరం తమిళ నాట పాగా వెయ్యాలనుకుంటున్న బీజేపీ ఈ పరిణామాలతో కంగుతింది.