Go_Back_CM_Sirఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ గత మూడున్నరేళ్ళుగా మూడు రాజధానుల పాట పాడుతూనే ఉన్నారు. అది వారి ఆలోచన, వారి నిర్ణయమే తప్ప ప్రజలు మూడు రాజధానులు కోరుకోలేదు. కానీ ప్రజలే మూడు రాజధానులు కోరుకొంటున్నారని నమ్మించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ చాలా హడావుడి చేశారు.

ఇంతగా వాదించి, హడావుడి చేసిన తర్వాత వారు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారా… అంటే అదీ లేదని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెన్నైలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ తప్పుగా అర్దం చేసుకొన్నారని, నిజానికి విశాఖ ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖే రాజధాని అని చెపుతున్నారు. ఢిల్లీ సదస్సులో సిఎం జగన్‌ అతిత్వరలో తాను పెట్టేబేడా సర్ధుకొని విశాఖకి వెళ్లిపోబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు జూలైలో విశాఖకి వెళ్దాం అంటున్నారు.

బడ్జెట్‌ సమావేశాలకు ముందు గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం గొప్పదనం, విధానాలు, భవిష్యత్‌ ప్రణాళికలు, రాష్ట్రాభివృద్ధి జరుగుతున్న తీరు గురించి వివరిస్తారు. ఆ ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుంది. కనుక దానిలో తప్పకుండా మూడు రాజధానులు, విశాఖ రాజధాని డప్పు మారుమోగించి ఉండాలి. కానీ లేదు!

అలాగని ఈవిషయం దానిలో వ్రాయడం మరిచిపోయిందనుకోలేము. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై పునరాలోచనలో ఉన్నట్లు భావించవచ్చు. అంతేగాదు… ఈ విషయంలోగానీ, విశాఖ రాజధాని విషయంలో గానీ వైసీపీకి చిత్తశుద్ధి లేదని కూడా స్పష్టమవుతోంది.

వైసీపీ ‘బ్రెయిన్ చైల్డ్’ మూడు రాజధానుల గురించి ఎప్పుడూ వైసీపీ నేతలే మాట్లాడారు తప్ప ఏనాడూ ప్రజలు మాట్లాడింది లేదు. దానిని సమర్ధించిన దాఖలాలు లేవు. ఒకవేళ రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కోరుకొని ఉండి ఉంటే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు రాయలసీమ జిల్లాలలో ప్రజలు ఇంతగా బ్రహ్మరధం పట్టి ఉండేవారే కాదు కదా? ఇప్పుడు మూడూ లేవు… కర్నూలులో న్యాయరాజధాని లేదని స్పష్టమైంది కనుక రాజధాని చేస్తామంటే విశాఖనగరవాసులు ఎగిరి గంతేయాలి కదా? కానీ ఏ ఒక్కరూ కనీసం స్పందించడం లేదు!

ఒక్క జనజాగరణ సమితి స్పందించింది. అదీ… ఏమి కోరుతోందంటే “సిఎం సార్.. రాజధాని అమరావతిని నిర్మించండి లేకుంటే విశాఖ రావద్దని!” ఈ మేరకు విశాఖనగరంలో పలుచోట్ల సిఎం జగన్‌ ఫోటోతో “గో బ్యాక్ సిఎం సర్,” అంటూ పోస్టర్లు కూడా పెట్టింది.

కనుక ఇప్పటికైనా ప్రజలు ఏమి కోరుకొంటున్నారో వైసీపీ ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. కాదని ఇంకా తమ అభిప్రాయాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే చివరికి నష్టపోయేది వైసీపీయే. ఈవిషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంతా వారికే మంచిది.