Telangana and Andhra Pradesh Glory Situationశ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునఃనిర్మాణ వేడుకలతో యాదాద్రి కొండ వెలిగిపోతోంది. యాదాద్రిలో వైభవంగా జరిగిన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. నేటి నుంచి ఆలయంలో స్వామి వారి స్వయంభు విగ్రహారాధన మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు.

“అదిగో అల్లదిగో… శ్రీహరివాసము…” అన్నట్లు ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులను., సిబ్బందిని.,ఆర్కిటెక్ట్ లను సీఎం కేసీఆర్ సత్కరించారు. కేసీఆర్ ఏంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విధంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి తన ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పనులను పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలనుకున్నారు.

ఐటీ పరిశ్రమలలోనే కాదు, ఆలయాలలోనూ తెలంగాణా తన ప్రత్యేకతను చాటుకుంది. ఏపీకి తిరుమల మాదిరి తెలంగాణకు యాదాద్రి నిలిచిపోవాలనే తలంపుతో కేసీఆర్ కంకణం కట్టుకుని నిర్మాణం గావించారు. అందుకే నేడు యాదాద్రిలో శోభాయాత్రలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. అటు తెలంగాణాలో కొత్త నిర్మాణాలకు ప్రభుత్వాలు అకింత భావంతో పని చేసి పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రతిష్టను నానాటికి ఇరుమడింప చేసుకుంటుంటే, ఇటు ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో రాష్ట్ర ప్రతిష్టను రోజురోజుకి దిగజార్చుతుందనేది ప్రజల ఆవేదన.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కానీ., రాష్ట్ర ప్రజలకు కానీ మేలు కలిగే కార్యక్రమం ఏ ఒక్కటైనా చేసిందా? అంటూ ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రజా వేదికతో మొదలైన కూల్చివేతల కార్యక్రమం ఏపీలో ఇప్పటికి నిర్విరామంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూనే ఉంది. అమరావతి మీద విషం కక్కి రాజధానిని కూల్చివేశారు., పాలనా విధానాలు చేత కాక వాణిజ్య – వ్యాపార రంగాలను కూల్చివేశారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.

పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిశ్రమలు., పెట్టుబడులు., ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణాల గురించి ఆలోచిస్తుంటే జగన్ మాత్రం “కూలతొయ్యడాలు – కూల్చివేతలు” అంటూ సమయం వృధా చేస్తున్నారు. టీటీడీ వంటి ప్రతిష్టాత్మకమైన పుణ్య క్షేత్రాలలో జరిగే సేవ కార్యక్రమాలకు కూడా చీటీ పాటలా మాదిరి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇటువంటి చర్యల వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే కనీస స్పృహ కూడా లేకుండా టీటీడీ పాలక మండలి ప్రవర్తించిన తీరు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని మిగిల్చింది అని తమ సొంత పార్టీ ఎంపీ ఆర్ఆర్ఆర్ ఎన్నో సందర్భాలలో మీడియా ముఖంగా వెల్లడించారు.

‘కట్టడాలా కూల్చివేతలు’ వంటి అనాలోచన చర్యల వలన జగన్ ప్రభుత్వం రాబోయే తరానికి ‘శిధిలాలను’ మాత్రమే మిగులుస్తుంది అంటూ “కూల్చివేతల తుగ్లక్ రాజుగా” జగన్ చరిత్రలో మిగిలి పోతారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ‘నిర్మించడం చేతకాని వాడే నిర్ములన చేస్తాడని.,’ ‘అభివృద్ధి చెయ్యలేని వాడే ఆటంకాలు పెడతారని’ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు తనదైన ట్రేడ్ మార్క్ విమర్శలు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో విచిత్రమైన పరిస్థితి నెలకొనడం కొసమెరుపు. “అటు శోభాయాత్రలు – ఇటు శిధిలావస్థలు” అంటూ నిర్వేదనతో మాట్లాడుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు!