giri-babu about tollywood life styleకొత్త నటుల సినిమా ఒక్కటి హిట్ అయితే చాలు, వాళ్లు ఆకాశం వైపు చూస్తున్నారని, అలాగే వారి పక్క నుండే వ్యక్తులు చెప్పే మాటలు వింటున్నారని, ఇలా ఉండాలి… అలా ఉండాలి అని లేనిపోనివి నేర్పిస్తున్నారని, కార్వాన్ అడుగు, బయట కూర్చోవద్దు, వాళ్లతో కూర్చోవద్దు… ఎక్కువగా మాట్లాడొద్దు… ఈ విధంగా పలువురు చెప్పే మాటలు విని అమాయక నటులు మోసపోతున్నారని… సీనియర్ నటుడు గిరిబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ కారణాల వలనే వారికి రెండో సినిమాలో నటించే అవకాశం కూడా వారికి ఉండట్లేదు. కాస్తో కూస్తో నిలదొక్కుకున్న వాళ్ళు రెండు, మూడు సినిమాల్లో నటించిన తర్వాత… వారే కథ చెప్పడం, మార్చడం, డిమాండు చేయడం మొదలుపెడుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో, పొగరుతో, మేం పెద్ద హీరోలమైపోయాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో… పక్కవాళ్లు చెప్పే మాటలు నమ్మి… తమ జీవితాలను కొత్త నటులు చేతులారా పాడు చేసుకుంటున్నారని ఇండస్ట్రీలోని విషయాలను చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కళా సేవ కోసం సినీ రంగానికి ఎవరూ రారని, పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, బాగా సంపాదించడం కోసమే వస్తారని, ఇందుకు ఎవరూ అతీతులు కారని అన్నారు. ‘పేరు, డబ్బే కదా ఏ మనిషి అయినా కోరుకునేది. సినీ రంగంలోకి ఎవరొచ్చినా వీటి కోసమే వస్తారు తప్పా, కళారాధన కోసమో, కళాసేవ కోసమో, ప్రజాసేవ కోసమో ఎవరూ రారు. ఆ విధంగా ఎవరైనా చెబితే అది శుద్ధ అబద్ధమని తేల్చేసారు.

జానపద చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు నిర్మించాలని ఉంది. ఒక జానపద చిత్రమో లేక కౌబాయ్ చిత్రమో చేయాలని ఉంది. నాకు కత్తులు, గుర్రాలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి ‘చందమామ’ బాగా చదివేవాడిని… నాడు జానపద సినిమా తీయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పటి సినిమాలకు అయితే, ఆ అవసరం లేదు. ఎందుకంటే, గ్రాఫిక్స్ వచ్చేశాయి కదా అని అభిప్రాయపడ్డారు ఈ సీనియర్ ఆర్టిస్ట్.