'Ghost ship' in Myanmar:కొన్ని అద్భుతాలు ఆశ్చర్యం కలిగిస్తే… మరికొన్ని అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. రెండో కోవకు చెందినదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. తొమ్మిది సంవత్సరాల క్రితం వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరిన ఓ భారీ సరుకు రవాణా నౌక మార్గమధ్యంలో అదృశ్యమైంది. దాని కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో ఇక గాలింపు నిలిపివేశారు. ఇప్పుడా నౌక అకస్మాత్తుగా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం సరుకులతో బయలుదేరిన ‘శామ్ రటులంగి పీబీ 1600’ అనే భారీ ఓడ చివరిసారిగా తైవాన్‌లో కనిపించింది. ఆ తర్వాత అది అదృశ్యమైంది. తాజాగా ఆగస్టు 30న దక్షిణ మయన్మార్ తీరంలోని ఈ ఓడ కనిపించింది. భారీ ఓడను చూసిన స్థానికులు ఆ విషయాన్ని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి లోపలికి వెళ్లి చూశారు. అయితే వారికి లోపల చిన్న వస్తువు కూడా వారికి కనిపించలేదు. ఓడ సిబ్బంది ఆనవాళ్లు కూడా లేవు.

జాలర్లు ఇచ్చిన సమాచారంతో ఓడ దగ్గరికి చేరుకున్న థోంగ్వా మునిసిపాలిటీకి చెందిన స్థానిక ఎంపీ నె విన్ యాంగాన్ మాట్లాడుతూ… ఓడ మొత్తం గాలించినట్టు చెప్పారు. లోపల కార్గో కానీ, సిబ్బంది కానీ కనిపించలేదని, ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమని, ఇన్నాళ్ల తర్వాత ఓడ కనిపించడం తమకు పజిల్ లాంటిదని వివరించారు. ప్రస్తుతం ఈ ఓడను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మయన్మార్ నేవీ అధికారులు అకస్మాత్తుగా ఓడ కనిపించడం వెనుక ఉన్న కారణాలను అన్వేషిస్తున్నారు.