ghanta srinivas rao to join ysr congress what about avanthiవైసీపీలో అరగంట మంత్రి అంటే ఎవరో… ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. మాజీ అయిపోయినా అవంతి శ్రీనివాస్‌కి ఆ ‘అరగంట’ బిరుదు మాత్రం ‘పద్మశ్రీ’ బిరుదులా సోషల్ మీడియాలో అలాగే ఉండిపోయింది. అది వేరే విషయం.

ఇప్పుడు వైసీపీలో అరగంట కాదు ‘గంట’ మోగుతోంది. ఈ గంట ఎవరంటే మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాస రావు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఆ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇంతకాలం అవంతి శ్రీనివాస్‌ ఆయన లోనికి ప్రవేశించకుండా గేట్లు మూసేసి జాగ్రత్తపడ్డారు.

అయితే గత కొన్ని రోజులుగా అవంతి శ్రీనివాస్ గ్రహస్థితి బాగోకపోవడంతో మంత్రి పదవి ఊడిపోయింది. తాజాగా జిల్లా నియోజకవర్గం బాధ్యతల నుంచి కూడా జగనన్న తప్పించేయడంతో అవంతికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు విశాఖ జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నంలో విజయసాయి రెడ్డితో చిన్న క్లాష్ అయినప్పటి నుంచే అవంతి గ్రహాలు అరగంటకి, పావు గంటకీ ఓసారి మారిపోతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ విశాఖ జిల్లా వైసీపీనేతలతో ఎవరితోనూ సత్సంబంధాలు లేకపోవడం అవంతి ప్రస్తుత పరిస్థితి కారణమని తెలుస్తోంది.

ఇప్పుడు ఆయన బలహీన క్షణాలలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆయన జనసేనలో చేరిపోయేలా ఉన్నారని తెలియడంతో వైసీపీ నుంచి సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. గంటకి అరగంటకి మద్య చాలా తేడా ఉంటుంది కనుక ఒకవేళ గంట వైసీపీలోకి వస్తే అవంతి శ్రీనివాస్ ఉంటారా లేక మళ్ళీ టిడిపి గూటికి చేరుకొంటారా?