Geetha Govindam movie leak-ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారిన విజయ్ దేవరకొండ “గీత గోవిందం” సినిమా పూర్తిగా లీక్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా పెన్ డ్రైవ్ మరియు సిడిలలో సర్క్యూలేట్ అవుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అర్భన్ ఎస్పీ విజయరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు జరుపుతున్నారు.

స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన విచారణలో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సినిమా సీన్లను షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అమరావతి పరిధిలోని తాడేపల్లి, కేఎల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని తమకు ఈ సినిమాను పంపించిందని చెప్పారు.

ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని ఈ లీక్ వెనకున్న అసలు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆ అమ్మాయికి పరిచయమున్న ఓ యువకుడు హైదరాబాద్ లో సినిమా ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని, అతనే తన వద్ద ఉన్న సినిమాను అత్యుత్సాహంతో ఆమెకు పంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ లీకేజ్ కేవలం కొన్ని సన్నివేశాల వరకేనా? లేక పూర్తి సినిమా లీక్ అయ్యిందా? అనే దానిపై అధికారిక సమాచారం లేదు గానీ, పెన్ డ్రైవ్ లో సర్క్యూలేట్ కావడంపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పలు పెద్ద హీరోల సినిమాల ‘రా ఫుటేజ్’లు కూడా లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు.