Geetha-Govindam-100cr-Collectionsటాలీవుడ్ బాక్సాఫీస్ ను “గీత గోవిందం” వీరవిహారం చేస్తోంది. గత రెండు వారాలుగా నిర్విరామంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలను కూడా విజయ్ దేవరకొండ వెనక్కి నెట్టే పరిస్థితి నెలకొంది. ఇది వాస్తవం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ను గ్రాస్ 100 కోట్లు, షేర్ 50 కోట్లు క్రాస్ చేసిందంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో అది చర్చనీయాంశం అయ్యింది.

“గీత గోవిందం” విజయవంతంగా 50 కోట్లు క్రాస్ చేసిన మాట నిజమే గానీ, ఇంకా గ్రాస్ 100 కోట్ల క్లబ్ లోకి చేరలేదన్నది ట్రేడ్ టాక్. సాధారణంగా గ్రాస్ లో యావరేజ్ గా 60% వాల్యూ షేర్ ఉంటుంది. కానీ ఈ పోస్టర్ లో కేవలం 50 శాతం మాత్రం ఉందన్న పాయింట్ హైలైట్ అవుతుంది. ట్రేడ్ పండితుల లెక్క అయితే 50 కోట్లు షేర్ దాటింది గనుక, ఆ లెక్కన 85 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకు కూడా ఫేక్ కలెక్షన్స్ గోలేంటి? అన్నది సినీ ప్రేక్షకుల అసలు విమర్శ.

బహుశా ఈ వారం గడిస్తే గానీ, ఓవరాల్ గా గానీ “గీత గోవిందం” ఆ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవచ్చు. ఇంతలోనే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ…. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందంటూ ఫేక్ కలెక్షన్స్ ను ఫోకస్ చేయడం ఎందుకు? సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకు ఇలాంటి చర్చలు అభిమానులు ఎక్కువగా చేపడుతుంటారు. కానీ ఇలా తల తోక లేని గ్రాస్, షేర్ లతో “గీత గోవిందం” కలెక్షన్స్ పై కూడా రచ్చ జరుగుతోంది. బహుశా పీఆర్వోల ఉత్సాహమో, నిర్మాతల సంకల్పమో గానీ, విజయ్ దేవరకొండ మాత్రం బలవుతున్నాడు.