Krish still working: It's not final with Balayya!తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘బాహుబలి’ కొన్ని స్టాండర్డ్స్ ను సెట్ చేసింది. గ్రాఫిక్స్ విభాగంలో, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ‘బాహుబలి’ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఒక రకంగా కధ కంటే కూడా సినిమా విజయానికి దోహద పడిన అంశాలు ఇవే. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా రెండవ భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదటి భాగం మాదిరే వార్ సీన్స్ ను మరింత అద్భుతంగా జక్కన్న చెక్కుతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి.

‘బాహుబలి’ విశేషాలు ఇలా ఉంటే, బాలకృష్ణ 100వ చిత్రం ప్రతిష్టాత్మక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరుతో నిర్మితం కానున్న చారిత్రాత్మక కధలో కూడా పోరాట సన్నివేశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మరో వారంలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా పోరాట సన్నివేశాల గురించి హల్చల్ చేస్తున్న వార్తలు అభిమానులకు మాంచి ‘కిక్’ ఇస్తున్నాయి. కేవలం యుద్ధ సన్నివేశాల కోసమే దాదాపు 8 కోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయం మాదిరి ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది.

గ్లాడియేటర్, గేమ్ ఆఫ్ థ్రాన్స్, బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, ది మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరిగిన మొరాకోలోనే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా పోరాట సన్నివేశాలను చిత్రీకరణ జరుపబోతున్నారు. ఇప్పటికే ఈ లొకేషన్స్ ను నిర్మాత, ఆర్ట్ డైరెక్టర్ సందర్శించారని, అలాగే పోరాట సన్నివేశాల కోసం స్థానికంగా ఉన్న దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేసారని, తెలుగు చిత్ర సీమలో అత్యద్భుతంగా… మరో మాట చెప్పాలంటే… ‘బాహుబలి’ మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వార్ సీన్స్ ఉండబోతున్నాయని సినీ వర్గాల సమాచారం.

యుద్ధ సన్నివేశాల కావాల్సిన ఆయుధాలు, ఇతర సామగ్రిని సప్లై చేసేందుకు హైదరాబాద్ కు చెందిన రెండు సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వగా, ఇప్పటికే అవన్నీ మొరాకో చేరిపోయాయని, దాదాపుగా నాలుగు టన్నుల మెటీరియల్ ను మొరాకోకు తరలించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితం కాబోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఈ వార్ సీన్స్ హైలైట్ గా నిలుస్తుందని అప్పుడే ప్రచారం ఊపందుకోవడం అంటే, దర్శకుడు క్రిష్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉందని నందమూరి అభిమానులు విశ్వసిస్తున్నారు.