Gautamiputra Satakarni‘బాహుబలి’ సినిమాను దేశ విదేశాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు ప్రజలు కూడా విశేషంగా ఆదరించిన విషయం తెలిసిందే. భాషపై ఉన్న మక్కువతో సహజంగా ఇతర భాషా చిత్రాలను తమిళనాడు ప్రజలు ప్రోత్సహించరు అనే అపవాదు ఉంది. అయితే ‘బాహుబలి’ సినిమాతో అది కొంత సవరించినట్లయ్యింది. ఇదే ఊపును కొనసాగించేందుకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కూడా తమిళనాట అడుగు పెట్టబోతుందన్న సమాచారం లభిస్తోంది.

బాలకృష్ణ కెరీర్ లో 100వ చిత్రంగా అడుగుపెట్టిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగునాట మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఈ సినిమాలో ‘బాహుబలి’ స్థాయి నాణ్యత లేదన్న విషయం తెలిసిందే. యుద్ధ సన్నివేశాలలో గానీ, కధనంలో రక్తికట్టించే సన్నివేశాలు గానీ లేవు. అయితే అమరావతికి చెందిన బ్యాక్ గ్రౌండ్ మరియు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగు వ్యక్తి అన్న మమకారంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

మరి అదే తెలుగు వ్యక్తికి తమిళ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పలుకుతారా? దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకురావాలన్న ఆలోచనకు జై కొడతారా? అనేది వేచిచూడాలి. అయితే ‘బహుబలి’ సత్తా చాటింది కదా అన్న ఉద్దేశంతో అడుగుపెడితే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగానే మారుతుందని గుర్తు పెట్టుకోవాలి. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి కధ కాకపోయినా, ఆ స్థాయిలో నిర్మాణ విలువలు ఉన్న సినిమా అయితే బాగుంటుందన్నది విశ్లేషకుల భావన. ‘శాతకర్ణి’లో అయితే అవి స్పష్టంగా లోపించాయి.