Gautamiputra Satakarni Audio launch Rightsప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రధాన ప్రచారం ఆడియో ఈవెంట్లు. దీంతో వీటిని ఎంత ప్రతిష్టాత్మకంగా జరిపితే… ప్రేక్షకుల్లోకి అంత బలంగా సినిమా చేరుకుంటోంది. దీంతో పాటల వేడుకను ఎలా జరపాలి? ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కు అప్పగించాలి? అన్న అంశాలు కీలకంగా మారాయి. మరో వైపు కొన్ని ప్రతిష్టాత్మక సినిమాల కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా పోటీపడి మరీ ఆయా సినిమాల ఆడియో ఈవెంట్ లను ఆర్గనైజ్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.

అందులో భాగంగానే నందమూరి నటసింహం నటిస్తున్న 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ఆడియో ఈవెంట్ కోసం కొన్ని సంస్థలు పోటీపడగా, చివరకు ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకను నిర్వహించినటువంటి ‘జే మీడియా ఫ్యాక్టరీ’ చేతికి ‘శాతకర్ణి’ హక్కులు వెళ్ళినట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకనిర్మాతలతో కలిసి ఈ ఈవెంట్ ను ఎంతో అట్టహాసంగా జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయిట. ఆప్షన్స్ గా ఓ రెండు, మూడు ప్రణాళికలను సిద్ధం చేయమని సదరు ఈవెంట్ సంస్థకు ఇప్పటికే చిత్ర యూనిట్ వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికీ దాదాపుగా 24 సినిమాల ఆడియో ఈవెంట్లను జరిపిన ట్రాక్ రికార్డ్ ఉండడంతో ఈ ఆడియో ఈవెంట్ కూడా అదిరిపోతుందని ట్రేడ్ టాక్. ‘శ్రీమంతుడు’తో పాటు ‘కబాలి, కుమారి 21ఎఫ్, ఇంకొక్కడు, ఎం.ఎస్.ధోని, జ్యోఅచ్యుతానంద’ వంటి ఇటీవల సినిమాలు సదరు ‘జే మీడియా ఫ్యాక్టరీ’ అకౌంట్ లో ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకే ఈ పోటీ ఉంటే, టెలికాస్టింగ్ హక్కుల కోసం మీడియా సంస్థల మధ్య ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో చూడాలి.