Garam Theatrical Trailer talkసాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న చిత్రం “గరం.” మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆది ఫ్యామిలీ సొంతంగా నిర్మించింది. అగస్త్య సంగీతం అందించిన ఆడియో బుధవారం నాడు విడుదలైంది. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ సినిమాపై ఏ మాత్రం ఆసక్తిని పెంచలేకపోయింది.

అగ్ర హీరోలు కూడా ప్రయోగాలు చేయాలని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్న సమయంలో ఆది వంటి వర్ధమాన హీరో ఓ రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ లో నటిస్తే ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారోనన్నది ప్రశ్నార్ధకమే. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తుండగా, షకలక శంకర్, బ్రహ్మానందం కమెడియన్లుగా నటించిన ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలు 70, 80 దశకాల్లో రూపొందిన చిత్రాల మాదిరి ఉండడంతో… అసలు ఈ సినిమా ట్రైలర్ ను ఎందుకు విడుదల చేసారా… అన్న ఆలోచనలు రావడం సహజమే. బహుశా దీనికి బదులు అసలు ట్రైలర్ ను విడుదల చేయకపోయినా ఈ సినిమాకు ఇంకాస్తా హెల్ప్ అయ్యుండేదేమో!

‘ప్రేమకావాలి, లవ్లీ’ చిత్రాలతో ప్రామిసింగ్ యాక్టర్ గా కనపడ్డ ఆది, ఆ తర్వాత నటించిన ‘సుకుమారుడు, ప్యార్ మే పడిపోయా, గాలిపటం, రఫ్’ చిత్రాలతో నిరాశపరిచారు. దీంతో ఆది కెరీర్ కు “గరం” సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరి ట్రైలర్ చూస్తే మరోసారి ఆది భంగపడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.